కల నెరవేరుతోంది.. ‘మేడిన్ ఆంధ్రా’పై వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు

0

దేశంలో వైద్య పరికరాల ఉత్పత్తి కేంద్రంగా విశాఖపట్నం ఎదుగుతోంది. దేశ అవసరాలను తీర్చడంతోపాటు.. వైద్య పరికరాలను ఎగుమతి చేసే లక్ష్యంతో ఏపీ మెడిటెక్ జోన్ ఏర్పాటైంది. వైజాగ్‌లోని మెడ్‌టెక్ జోన్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో ప్రశంసలు గుప్పించారు. ‘‘మన దేశం ఏటా రూ. 50 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకునేది. ఈ పరిస్థితి విశాఖలోని మెడికల్ డివైజెస్ క్లస్టర్ కారణంగా మారింది. దేశంపై దిగుమతుల భారం తగ్గింది. ఎంఆర్ఐ యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి రూ.4.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేది. మనవాళ్లు రూ.98 లక్షలకే వాటిని రూపొందిస్తున్నారు. వాటి ఉత్పత్తి కోసం ఏపీ సీఎంకు ప్రతిపాదనలు పంపాం.

ఈ క్లస్టర్‌తోపాటు మిగతా రాష్ట్రాల్లోనూ 5-6 మెడికల్ క్లస్టర్లను ఏర్పాటు చేసే దిశగా యోచిస్తున్నాం. వైజాగ్ క్లస్టర్ విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశాం’’అని నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో ప్రసంగించారు.

మంత్రి మాట్లాడిన వీడియోను ట్వీట్ చేసిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపాడు. ఏపీ మెడ్‌టెక్ జోన్ లాంటి అనువైన వాతావరణం, డాక్టర్ జితేందర్ సింగ్ శర్మ లాంటి హెల్త్ ఛాంపియన్లు దేశాన్ని హెల్త్ సూపర్ పవర్‌గా రూపొందించాలనే కలను సాకారం చేస్తున్నారంటూ వీరూ ప్రసంశలు గుప్పించాడు. ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం, నితిన్ గడ్కరీలను ఆయన ట్యాగ్ చేశారు.

ఏపీ మెడ్‌టెక్ జోన్‌ను 2016లో ఏర్పాటు చేశారు. దీని కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమీపంలో 270 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. మెడికల్ పరికాల ఉత్పత్తి ఖర్చును 40 శాతం వరకు తగ్గించే లక్ష్యంతో ఈ జోన్‌ను ఏర్పాటు చేశారు. జితేందర్ శర్మ ఏపీ మెడ్‌టెక్ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
Please Read Disclaimer