70 ఏళ్ల బామ్మ బుమ్రాను అనుకరిస్తే..

0

పాల్ ఆడమ్స్.. ముత్తయ్య మురళీధరన్.. లసిత్ మలింగ.. సోహైల్ తన్వీర్.. ఇలా విచిత్రమైన శైలితో బౌలింగ్ చేసే బౌలర్లు చాలామందిని చూశాం. జస్ప్రీత్ బుమ్రా రూపంలో మనకూ అలాంటి బౌలర్ ఒకడు దొరికాడు. ముందు చిత్రమైన బౌలింగ్ శైలితోనే అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతడి శైలి అదోరకంగా అనిపించింది. కానీ ఆ శైలితోనే బుమ్రా అద్భుతాలు చేశాడు. అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటి భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలి ప్రపంచకప్ లోనూ బుమ్రా అద్భుతంగా రాణించి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. బుమ్రా బౌలింగ్ శైలిని కుర్రాళ్లు అనుకరిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చాలా కనిపిస్తుంటాయి.

ఐతే ఇప్పటిదాకా చూసిన వీడియోలకు భిన్నమైంది ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటిదాకా కుర్రాళ్లే బుమ్రాను అనుకరించారు. కానీ తాజాగా 70 ఏళ్ల బామ్మ ఒకరు బుమ్రాలా బౌలింగ్ చేసే ప్రయత్నం చేయడం విశేషం. టీవీలో బుమ్రా బౌలింగ్ ను చూస్తూ తమిళనాడుకు చెందిన బామ్మ ఒకరు అతడిని అనుకరించారు. చిన్న సైజు ఫుట్ బాల్ పెట్టుకుని ఆమె బుమ్రా స్టయిల్లో చేతుల్ని ముందుకు పెట్టి పరుగెత్తుకుని వెళ్లడం భలే సరదాగా అనిపిస్తోంది. ఈ వీడియోను శాంత సక్కుబాయి అనే అమ్మాయి ట్విట్టర్లో షేర్ చేసింది. చివరికి బామ్మలు కూడా బుమ్రాను మెచ్చి అతడిని అనుసరిస్తున్నారని ఆమె వ్యాఖ్య జోడించింది. ఈ వీడియో బుమ్రా వరకు వెళ్లి.. అతను చాలా సంతోషపడుతూ ట్వీట్ చేయడం విశేషం.
Please Read Disclaimer