Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఏపీ పేదలకు సొంత ఇల్లు..!

ఏపీ పేదలకు సొంత ఇల్లు..!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 లక్షల 75వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర.. పట్టణ ప్రాంతాల్లో సెంటు చొప్పున.. ఈ ఇళ్ల స్థలాలు ఉండనున్నాయి. ఇందులోనే… ఒక బెడ్ రూం, హాలు, కిచెన్, వరండా వచ్చేలా ఇంటి నిర్మాణం చేస్తారు. సగం శ్లాబ్.. సగం రేకులతో ఆ ఇంటి డిజైన్ ను ఇప్పటికే ఖరారు చేశారు. ఇళ్ల పట్టాలన్నింటినీ నేడు పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. శంకుస్థాపనలు మాత్రం.. వచ్చే నెల ఏడో తేదీ వరకూ చేస్తోంది. మొదటి విడతలో పదిహేను లక్షల ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా.. పంపిణీ చేయబోతోంది. అలాగే… ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని.., క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా… ఈ జాబితాలో ఇంటి స్థలం కోటాలో క్రమబద్దీకరిస్తున్నారు. అయితే.. నాలుగైదు లక్షల ఇళ్ల స్థలాల కోర్టు కేసుల్లో ఉన్నాయి. 23 వేల కోట్ల విలువైన భూములను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

దేవాదాయ భూములు..మైనింగ్ భూములు… రాజధాని భూములు.. ఇలా అనేక వివాదాస్పద భూములను ప్రభుత్వం సేకరించడంతో.. బాధితులు కోర్టుకెళ్లారు. కోర్టు స్టే ఉత్తర్వులిచ్చింది. ఈ విషయాన్ని చెబుతూ.. హైకోర్టు స్టే ఉన్నందున.. ఇప్పటికి మంజూరు పత్రం ఇస్తున్నామని… హైకోర్టు నుంచి అన్ని ఆటంకాలు తొలగిపోయాక… ఇళ్ల స్థలాలిస్తామని ఓ లేఖలో చెప్పనున్నారు. ఒక వేళ.. ఆ భూముల విషయం హైకోర్టులో తేలకపోతే.. ఏం చేస్తారో క్లారిటీ లేదు. ప్రభుత్వానికి హైకోర్టులో అనుకూల తీర్పు రాకపోతే.. వేరే చోట ఇస్తారో లేదో కూడా స్పష్టత లేదు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది. అయితే.. ఆ స్థలాలన్నీ ఊళ్లకు దూరంగా ఉంటాయి. వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడం ఓ పెద్ద సవాల్ . మొత్తంగా 17వేల కాలనీలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అన్ని చోట్లా.. పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.

లేకపోతే.. ఆ స్థలాలుఎందుకూ ఉపయోగపడకుండా పోతాయి. ఈ విషయంలో ప్రభుత్వం మరికొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేపడుతుందో.. లబ్దిదారులే కట్టుకోవాలో ఇంత వరకూ క్లారిటీలేదు. లక్షన్నర ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇసుక ఉచితమని.. మెటీరియల్ ఖర్చులను ఇస్తామని… కానీ నిర్మాణ ఖర్చు మాత్రం లబ్దిదారులే పెట్టుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా… స్వయంగా ఇళ్లను నిర్మించి ఇస్తే.. త్వరగా.. ముప్పై లక్షల మంది పేదలు ఇంటి వారవుతారు. లేకపోతే.. వచ్చే ఎన్నికల వరకూ సాగదీసి.. మళ్లీ గెలిపిస్తే.. పూర్తి చేస్తామనే వాగ్దానంతో ఎన్నికలకు వెళ్లే వ్యూహాన్ని అమలు చేయకపోతే.. ప్రజలు చిన్నదో.. పెద్దదో సొంతింటి వాళ్లు అవుతారు.

తాము ఇచ్చే భూములు అమ్ముకోవచ్చని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ… డి-పట్టాలు మాత్రమే పంపిణీ చేస్తోంది.అంటే అమ్ముకోవడానికి సాధ్యం కాదు. అమ్ముకోవాలంటే.. కన్వేయన్స్ డీడ్‌లను పంపిణీ చేసి.. రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ చట్ట ప్రకారం అది సాధ్యం కాదు.. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది.