చిన్నారులపై హత్యాచారం చేస్తే నడిరోడ్డుపై ఉరి

0

చిన్నారులపై అత్యాచారానికి పాల్పడి వారిని హత్య చేసినట్లు నేరం రుజువైతే దోషులను బహిరంగంగా ఉరి తీయాల్సిందేనని పాకిస్థాన్ పార్లమెంట్‌ తీర్మానించింది. తాజాగా, దీనికి సంబంధించిన తీర్మానాన్ని పాక్‌ పార్లమెంట్‌ ఆమోదించింది. పాకిస్థాన్‌లోని నౌషెరా ప్రాంతంలో 2018లో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అక్కడ సంచలనం సృష్టించింది. దీంతో చిన్నారులపై జరుగుతున్న హత్యాచారాలను నియంత్రించాలని పాక్‌ పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అలీ మహమ్మద్ ఖాన్‌ ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

భవిష్యత్తులో చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడాలంటే భయపడేలా దోషులను బహిరంగంగా ఉరి తీయాలని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానాన్ని ఆమోదించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉరి తీయడం సరైంది కాదని, ఐక్యరాజ్య సమితి నిబంధనలను ఉల్లంఘించడం అవుతుందని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ నేత రాజా అష్రాఫ్‌ పేర్కొన్నారు.

దోషులకు విధించే శిక్షలో తీవ్రత పెంచినంత మాత్రాన నేరాల సంఖ్య తగ్గదని పేర్కొన్నారు. దీనిపై మానవ హక్కుల మంత్రిత్వ శాఖ మంత్రి శిరీన్‌ బజారీ సైతం స్పందించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన తీర్మానం ఒక పార్టీ తీసుకున్న నిర్ణయమే తప్ప ప్రభుత్వ నిర్ణయంలా అనిపించడం లేదని, దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. మానవ హక్కుల మంత్రిత్వ శాఖ దీన్ని అంగీకబోదని చెప్పారు.