కేసీఆర్‌కు పవన్ రిక్వెస్ట్.. ఏపీలో జనసేనాని కొత్త కార్యక్రమం!

0

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్‌కు ఓ రిక్వెస్ట్ పంపారు. విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ప్రకటించినందువల్ల.. వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని కేసీఆర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా మా ప్రతినిధుల ద్వారా కార్మిక సంఘాల నాయకులూ కోరారని పవన్ తెలిపారు.

నలభై రోజులకిపైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు. తద్వారా ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఆపై సానుకూలంగా వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నానని కేసీఆర్‌ను పవన్ రిక్వెస్ట్ చేశారు.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు గతంలో పవన్ కళ్యాణ్ మద్దతు కోరగా.. సీఎం కేసీఆర్‌ను స్వయంగా కలిసి సమ్మె విషయమై తాను చర్చిస్తానని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. జనసేన లాంగ్ మార్చ్ తర్వాత కేసీఆర్ దగ్గరకు వెళ్తానన్నారు. అనంతరం.. తమ వాళ్లు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారని.. కానీ అటు నుంచి స్పందన లేదన్నారు. సీఎం కేసీఆర్ సమ్మెపై చర్చించేందుకు సిద్దంగా లేరన్నారు.

తెలుగు భాష కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్.. మాతృ భాష పరిరక్షణ, నదుల పరిరక్షణ కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మాతృ భాష పరిరక్షణ, నదుల పరిరక్షణను ముందుకు తీసుకెళ్లింది ప్రజలే, ప్రభుత్వాలు కాదన్న ఆయన.. ‘‘మన నుడి, మన నది’’ నిరంతరంగా సాగాల్సిన కార్యక్రమం అన్నారు. త్వరలో విధివిధానాలు తెలియజేస్తామన్నారు.
Please Read Disclaimer