పవన్ కల్యాణ్.. కులం కామెంట్స్!

0

తన పార్టీల కమిటీల ఏర్పాటులో ఒక కులానికే ప్రాధాన్యం ఉండదని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ప్రతి నియోజకవర్గం వారీగా కమిటీలు ఏర్పడతాయని.. వాటిల్లో ఒకే కులానికి ప్రాధాన్యం దక్కే పరిస్థితి ఉండకూడదని పవన్ కల్యాణ్ ఉద్బోధించారు. ఈ మేరకు తన పార్టీ నాయకత్వానికి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.

జనసేన కమిటీల్లో అన్ని కులాల వాళ్లకూ ప్రాధాన్యత దక్కాలని చెప్పడం పవన్ కల్యాణ్ ఉద్దేశం. కమిటీలను కింది స్థాయిలో ఏర్పరిచే నేతలకు పవన్ కల్యాణ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

అయితే తన పార్టీ విషయంలో కులాల వారీగా ప్రాధాన్యత అనే టాపిక్ గురించి పవన్ కల్యాణ్ మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. తను కాపుల ఓట్లను నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని ఆయన చెప్పుకొంటూ వస్తూ ఉన్నారు. తను కాపులను అడిగి రాజకీయాల్లోకి రాలేదని పవన్ అంటున్నారు. అయితే పవన్ పార్టీకి కుల ముద్ర మాత్రం కొనసాగుతూ వస్తోంది.

అందుకూ కారణాలున్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసింది కాపు జనాభా గణనీయంగా ఉన్న ప్రాంతాల్లోనే. భీమవరం గాజువాక నియోజకవర్గాలో రాష్ట్రంలోనే కాపు ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉన్న నియోజకవర్గాలు. అలాంటి చోట పవన్ కల్యాణ్ వెళ్లి పోటీ చేశారు. కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే పవన్ కల్యాణ్ పోటీ చేశారనే విశ్లేషణలు బాహాటంగానే వినిపించాయి.

ఇక పవన్ కల్యాణ్ ప్రచార పర్వం కూడా కాపుల ఓట్లు గట్టిగా ఉన్న నియోజకవర్గాల వారీగా మాత్రమే సాగింది. దీంతో ఆయన పార్టీకి మరింతగా ఆ ట్యాగ్ అంటుకుంది. అయితే పవన్ పార్టీకి అది ఏ మాత్రం లాభించని సంగతి తెలిసిందే. కాపుల ఓట్లు గట్టిగా ఉన్న చోట పోటీ చేసి కూడా పవన్ విజయం సాధించలేకపోయారు. ఇలాంటి క్రమంలో తన పార్టీకి కుల ముద్రను తొలగించడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా ఉన్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Please Read Disclaimer