ఆ స్వార్థపరుడు చిరంజీవేనా.. పవన్ కల్యాణ్?

0

తన గొప్పలను తనే చెప్పుకుంటూ ఉన్నాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. ఇది వరకూ తన ఉద్యమ స్ఫూర్తి గురించి తన పోరాటాల గురించి తను చదివిన పుస్తకాల గురించి పవన్ చాలా చెప్పుకున్నాడు. ఆ గప్పాలపై సెటైర్లు కూడా పడ్డాయి. తెలంగాణ వచ్చాకా కొన్ని రోజుల పాటు తను అన్నం తినలేదని చెప్పడం ఎన్నో లక్షల పుస్తకాలు చదివినట్టుగా చెప్పుకోవడం.. ఇవన్నీ పవన్ కల్యాణ్ ను నవ్వులపాలు చేశాయి. ఆ పై ఈ మధ్య తన అన్న చిరంజీవి మీద కూడా పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కామెడీ అవుతున్నాయి. తను సినిమాల్లో చిరంజీవి వారసత్వంతో వచ్చినప్పటికీ తన నటన తనే చేసుకున్నట్టుగా పవన్ ఇటీవల చెప్పుకున్నాడు. తన బదులు చిరంజీవి నటించలేదని వ్యాఖ్యానించాడు.

ఇక్కడ ఆయన అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే..పవన్ స్థాయిలో నటించే వాళ్లు ఎంతో మంది అయితే వారంతా పవన్ కల్యాణ్ లు కాలేరు. చిరంజీవి తమ్ముడు కావడం వల్లనే పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ అయ్యారు. తన ఛరిష్మా నట వారసత్వం వల్ల కాదని పవన్ చెప్పుకోవడానికి ఎన్ని లాజిక్కులు అయినా మాట్లాడవచ్చు. కానీ చిరంజీవి తమ్ముడు కాకపోతే.. ఆయన సినిమాల్లో ఎదిగే ఛాన్స్ జీరో పర్సెంట్. కాబట్టి.. చిరంజీవి వారసత్వాన్ని తక్కువ చేసి చూపడానికి పవన్ చేసే ప్రయత్నాలు ప్రహసనాలే.

ఆ సంగతలా ఉంటే.. తను రాజకీయాల్లో కొనసాగడంపై పవన్ కల్యాణ్ మరో కామెంట్ చేశారు. ఎన్టీఆర్ తర్వాత ఎక్కువ కాలం పాటు పొలిటికల్ పార్టీని నడిపే హీరో తనే అని పవన్ చెప్పుకొచ్చారు తన పార్టీ కార్యకర్తల సమావేశంలో. అయితే ఇప్పటికే పవన్ కల్యాణ్ రాజకీయం విషయంలో చేతులుఎత్తేసినంత పని చేశారు. బీజేపీతో ఒప్పందానికి వెళ్లారు. కలిసి పోటీ అని ప్రకటించారు. మరోవైపు సినిమాల్లో చేస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో.. ఆయన రాజకీయంపై విమర్శలు రానే వస్తున్నాయి. అయినా తన స్థాయి గొప్పదని పవన్ చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా పవన్ కల్యాణ్ ఎన్టీఆర్ తో తనను తాను పోల్చుకుంటూ ఉండటం గమనార్హం.

ఇక కొంతమంది స్వార్థపరుల వల్ల ప్రజారాజ్యం పార్టీ విలీనం అయ్యిందని కూడా పవన్ వ్యాఖ్యానించారు. మరి ఆ స్వార్థపరులు ఎవరు? ప్రజారాజ్యం పార్టీ విలీనంతో లబ్ధి పొందింది ప్రధానంగా చిరంజీవే. రాజ్యసభ సభ్యుడు అయ్యి కేంద్ర మంత్రి అయ్యాడు. మిగతా వారిలో ఎవరూ అంత లబ్ధి పొందలేదు. చిరంజీవికే ఎక్కువ లబ్ధి కలిగింది. మరి ఈ లెక్కన తన అన్నను స్వార్థపరుడని పవన్ కల్యాణ్ అంటున్నట్టేనా?
Please Read Disclaimer