Templates by BIGtheme NET
Home >> Telugu News >> పవన్ కల్యాణ్ కు బిగ్ షాక్.. చేజారిన ‘గ్లాస్’.. 2024లో ఏ గుర్తు?

పవన్ కల్యాణ్ కు బిగ్ షాక్.. చేజారిన ‘గ్లాస్’.. 2024లో ఏ గుర్తు?


జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాసు.. చేజారిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్లో ఈ మేర‌కు వెల్ల‌డించింది. ఈ మేర‌కు ప్రాంతీయ పార్టీల హోదాలో, జాతీయ పార్టీల హోదాలో ఉన్న పార్టీల‌కు కామ‌న్ సింబ‌ల్ ను కేటాయిస్తూ ఉత్త‌ర్వులు జారీచేసింది. ఈ జాబితాలోంచి జ‌న‌సేన పేరును తొల‌గించింది. దీంతో.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయ‌లేరని తేలిపోయింది.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ నెల 23న నోటిఫికేష‌న్ జారీచేసింది. దీని ప్ర‌కారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీకి ఫ్యాన్, టీడీపీకి సైకిల్‌, టీఆర్ ఎస్ కు కారు గుర్తులు రిజ‌ర్వు చేసింది. ప్రాంతీయ పార్టీల హోదాలో ఈ పార్టీలు త‌మ గుర్తుల‌ను కాపాడుకున్నాయి. ఇక‌, జాతీయ పార్టీల హోదాలో బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, తృణ‌మూల్‌, బీఎస్పీ, ఎన్సీపీలు త‌మ గుర్తుల‌ను ద‌క్కించుకున్నాయి.

తెలంగాణ విష‌యానికి వ‌చ్చే స‌రికి టీఆర్ ఎస్‌, వైసీపీ, టీడీపీ, ఎంఐఎం పార్టీల‌కు వారి గుర్తుల‌నే రిజ‌ర్వు చేసింది ఎన్నిక‌ల సంఘం. జాతీయ పార్టీల‌న్నీ య‌థావిధిగా గుర్తు సొంతం చేసుకున్నాయి. జ‌న‌సేన‌కు మాత్రం ఇక్క‌డ కూడా గాజు గ్లాసును ఇవ్వ‌లేదు.

గ‌త ఏడాది జ‌రిగిన జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో క‌నీసంగా ప‌ది శాతం సీట్ల‌కైనా పోటీచేయ‌ని కార‌ణంగా.. జ‌న‌సేన‌కు కామ‌న్ సింబ‌ల్ ను కేటాయిస్తున్న‌ట్టు ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. వాస్త‌వానికి గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీకి సిద్ధ‌మైంది. కానీ.. చివ‌రి నిమిషంలో మిత్ర ప‌క్షం బీజేపీ కోసం పోటీ నుంచి త‌ప్పుకుంది. ఇదే విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘానికి వివ‌రిస్తూ లేఖ రాసిన జ‌న‌సేన‌.. గాజు గ్లాసు గుర్తును త‌మ‌కు కేటాయించాల‌ని కోరింది. కానీ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం మాత్రం ప‌ట్టించుకోలేదు.

దీంతో.. 2024లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లకు గాజు గ్లాసు గుర్తు లేకుండానే జ‌న‌సేన బ‌రిలోకి దిగాల్సి ఉంది. ఈ గుర్తును ఫ్రీ సింబ‌ల్స్ లో మెన్ష‌న్ చేసింది ఈసీ. అంటే.. వేరే ఎవ‌రికైనా ఈ గుర్తును కేటాయించొచ్చు. 2025 నవంబరు 18 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, అప్పటి వరకు జరిగే ఏ ఎన్నికల్లోనూ కామన్ సింబల్ కేటాయించమని కోరే అర్హత జనసేనకు లేదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. జ‌న‌సేన అభ్య‌ర్థులంద‌రికీ కామ‌న్ సింబ‌ల్ లేక‌పోవ‌డం అనేది ఎన్నిక‌ల్లో ఎంతో కొంత ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, ఈ స‌మ‌స్య‌ను జ‌న‌సేనాని ఎలా అధిగ‌మిస్తారో చూడాలి.