మరో నందిగ్రామ్‌గా మారుస్తారా? చంద్రబాబు అరెస్టుపై జనసేనాని ఆగ్రహం

0

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అరెస్టులతో రెచ్చగొడుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు బలంతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ప్రభుత్వ చర్యలు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చే ప్రమాదం ఉందని పవన్ హెచ్చరించారు. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులను భయబ్రాంతులకు గురి చేస్తూ మహిళలను, వృద్ధులను పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని జనసేనాని తీవ్రంగా తప్పుబట్టారు.

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు రాజధాని గందరగోళానికి వైసీపీ ప్రభుత్వం తక్షణం తెరదించాలని ఆయన హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో రెండు మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న ఘటనలు ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని పవన్ ఆక్షేపించారు.

అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే మరింత ఉధృతం అవుతుందని ప్రభుత్వం గ్రహించాలని హెచ్చరించారు. రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్‌గా మార్చాలని జగన్ సర్కార్ యోచిస్తోందా అని పవన్ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం తక్షణం మానుకుని రాజధాని విషయంపై స్పష్టత ఇవ్వాలని జనసేనాని డిమాండ్ చేశారు.
Please Read Disclaimer