నా పెళ్లిళ్ల వల్లే జైలుకెళ్లారా? మీరు తలెత్తుకోలేకుండా మాట్లాడగలం: పవన్

0

సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలంటూ.. సీఎం జగన్ చేసిన విమర్శలపై జనసేనాని ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాను సరదాపడి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదన్న పవన్.. కావాలంటే మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోండి.. ఎవరు వద్దన్నారంటూ ఘాటుగా బదులిచ్చారు. నేను మూడు పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకు వెళ్లి వచ్చారా? అని పవన్ ప్రశ్నించారు. తాను విధానాలపై, సమస్యలపై మాట్లాడుతుంటే.. అధికార పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని పవన్ మండిపడ్డారు. పరిస్థితి చేయి దాటితే తాను కూడా తగిన రీతిలో సమాధానం చెబుతానన్నారు.

జగన్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం పట్ల స్పందిస్తే అసలు సమస్య మరుగున పడుతుందని.. తమ పార్టీ వాళ్లకు చెప్పానన్నారు. మీ ట్రాప్‌లో జనసేన నేతలు పడరని.. వైఎస్ఆర్సీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలపైనే తాము మాట్లాడతామన్నారు. ఆజాద్ జయంతి వేడుకల్లో.. జగన్ ఇలా మాట్లాడటమేంటని జనసేనాని ప్రశ్నించారు. సమస్యను పక్కదారి పట్టించడం కోసమే ఆయన ఇలా స్పందించారన్నారు.

తాను ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు మాత్రమే విమర్శిస్తున్నారన్నారు. కాపు రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమన్నా.. జగన్‌కు కాపులు ఓటేశారన్నారు. నాపై ఇతర కులాల నేతలతోనూ విమర్శలు చేయించొచ్చన్నారు.

జనసేన అంటే జగన్‌కు భయం ఉందన్న పవన్.. గెలుపోటములతో సంబంధం లేకుండా తాము ప్రజల పక్షాన నిలబడతామన్నారు. అందులో భాగంగానే మంగళవారం గవర్నర్‌ను కలిశామన్నారు.

151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఇసుక కొరత కారణంగా కోటి కుటుంబాలు ఇబ్బంది పడ్డాయన్నారు. నాలుగు నెలలుగా రాష్ట్రంలో ఇసుక కొరత ఉందన్న పవన్.. దాని వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. లక్షన్నర మందితో లాంగ్ మార్చ్ నిర్వహిస్తే గానీ.. ఐదుగురికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదన్నారు.

జగన్‌ను చూసి 151 మంది ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారన్న పవన్.. జగన్ అటు ఇటు అయితే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసుకోండని హెచ్చరించారు. జగన్ 1000 వాలా బాంబును తనకు, తన ఎమ్మెల్యేలకు చుట్టి అంటించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు.

పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయన్నారు. తమిళనాట కూడా తెలుగు మీడియం ఉందన్న పవన్.. ఇంగ్లిష్ గ్లోబల్ లాంగ్వేజ్ అయిందన్నారు. ఇంగ్లిష్ మీడియం తేవడం వెనుక హేతుబద్ధత ఉండాలన్నారు. 90 వేల మందికిపైగా ఉన్న టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వకుండా ఇంగ్లిష్ మీడియానికి మార్చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలన్నారు.

విజయవాడ నడిబొడ్డున ఉండి చెబుతున్నా.. మీ ఫ్యాక్షనిజానికి భయపడే వ్యక్తిని నేను కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. హుందాగా మాట్లాడాలని సీఎంకు సూచించారు. ఉపరాష్ట్రపతి పదవికి కూడా జగన్ గౌరవం ఇవ్వడం లేదన్నారు. మీరు తలెత్తుకోలేకుండా మేం మాట్లాడగలం అని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Please Read Disclaimer