పేటీఎం ఉపయోగిస్తున్న వారికి హెచ్చరిక.. ఆ ‘మెసేజ్‌’లతో జాగ్రత్తగా ఉండండి.. లేదంటే..

0

పేటీఎం వాలెట్ ఉపయోగిస్తున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వాలెట్ నుంచి డబ్బులు మాయం కావొచ్చు. దీనికి కారణం కేవైసీ. దేశీ ప్రముఖ ఇ-వాలెట్‌ సంస్థ అయిన పేటీఎం ఇప్పుడు ఈ అంశంపై కస్టమర్లను హెచ్చరిస్తోంది. మోసపూరిత ఎస్ఎంఎస్‌లతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘అకౌంట్ బ్లాక్‌కు సంబంధించిన ఎస్ఎంఎస్‌లు, కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. మేం ఎలాంటి మెసేజ్‌లు పంపించడం లేదు. ఇతర యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని అస్సలు చెప్పం. అందుకే యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. మోసగాళ్లు మీ అకౌంట్ వివరాలను తస్కరించేందుకు ప్రయత్నించొచ్చు’ అని ట్వీట్ చేశారు.


కేవైసీ వివరాలు సమర్పించకపోతే అకౌంట్‌ బ్లాక్‌ అవుతుందని, సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమంటూ వినియోగదారులకు ఎస్ఎంఎస్‌లు రావడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అందుకే విజయ్‌ శేఖర్‌ శర్మ ట్విట్టర్ వేదికగా కస్టమర్లను అలర్ట్‌ చేశారు.

తాజా కేవైసీ వ్యవహారంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఎవరికైనా కేవైసీ ప్రక్రియ అవసరం అయితే పేటీఎం అధికారిక కేవైసీ పాయింట్ల వద్దకు వెళ్లి లేదా పేటీఎం ఏజెంట్‌కు కాల్ చేసి ఇంటి వద్దనే పని పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఇకపోతే మోసగాళ్లు పేటీఎం నుంచి కాల్ చేస్తున్నామని, మీ అకౌంట్ బ్లాక్ అయ్యిందని, దాన్ని రీయాక్టివేట్ చేసుకోవాలని చెబుతారు. దీని కోసం ఎనీడెస్క్, టీమ్‌వ్యూయర్, క్వి్క్‌సపోర్ట్ వంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని కోరతారు. అంతే ఇలా చేస్తే మీ వాలెట్ లేదా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమౌతాయి. మీరు ఏమైనా మోసపోతే వెంటనే కస్టమర్ల కేర్ నెంబర్ 1800120130, 0120-4456456కు కాల్ చేసి విషయాన్ని తెలియజేయండి.
Please Read Disclaimer