పేరు, ఫొటోలు వాడొద్దు.. శంషాబాద్ బాధితురాలి పేరు ‘దిశ’గా మార్పు

0

శంషాబాద్ బాధితురాలి పేరును ఇక మీదట ‘దిశ’ అని పిలవాలని తెలంగాణ పోలీసులు సూచించారు. ఇందుకు సంబంధించి పోలీసులు అధికారికంగా పేరును మీడియాకు విడుదల చేశారు. నిర్భయ చట్టంలో బాధితురాలి పేరుతో పాటు.. కుటుంబ సభ్యుల వివరాలను బయట పెట్టవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ బాధితురాలి పేరును కూడా మార్చాలని నిర్ణయించారు. ఇక మీదట ‘దిశ’ పేరు మీదే వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

బాధితురాలి లేదా ఆమె కుటుంబ సభ్యుల ఫోటోలు, వివరాలు వెల్లడించొద్దని పోలీసులు సూచించారు. బాధితురాలి ఫొటోలు, ఆమె తల్లిదండ్రులు, సోదరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం కావడంతో.. పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

బాధితురాలికి న్యాయం జరగడం కోసం జస్టిస్‌ ఫర్‌ దిశ పేరుతో పిలవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ సూచించారు. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులను ఆయన ఒప్పించారు. సోషల్‌ మీడియా, ప్రసార మాధ్యమాల్లో బాధితురాలి పేరు వాడొద్దని, ‘జస్టిస్‌ ఫర్‌ దిశ’కు అందరూ సహకరించాలని సజ్జనార్ కోరారు.
Please Read Disclaimer