పృథ్వీ.. సిగ్గు పడాలి..ఏం మాటలవి? : పోసాని

0

అమరావతి రైతులపై సినీనటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ఫైర్‌ అయ్యారు. పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్న రైతులను రోడ్డుకీడ్చావ్‌ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..  ‘‘ప్రజల జీవితాలు బాగుపడతాయని భావించి ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని త్యాగం చేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటావా? రైతులు ప్యాంటూ, షర్ట్‌ వేసుకోకూడదా? రైతు ఆడపడుచులు ఖరీదైన బట్టలు వేసుకోకూడదా? పంటలు పండే భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చిన మహిళలు రెండు బంగారు గాజులు వేసుకొనేందుకు కూడా అర్హులు కాదా? వాళ్లు ఫోన్‌ చేతిలో పెట్టుకొని మాట్లాడకూడదా? ఇలాంటి మాటలు అన్నందుకు నువ్వు సిగ్గుపడాలి.  రైతులను, అమరావతి ఆడపడుచులను పెయిడ్‌ ఆర్టిస్ట్‌లు అనడం ఎంత సిగ్గుచేటు? వైకాపా అధినేత, సీఎం జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు ఏడాదిన్నర పాటు జనంలో తిరిగినా ఎప్పుడూ తేలిగ్గా మాట్లాడలేదు. సీఎం అయిన తర్వాత ఏ కులం పేరూ ఎత్తలేదు. జగన్‌ను, ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు మీలాంటి వాళ్లు పుట్టారు.. సిగ్గుపడండి’’ అంటూ ధ్వజమెత్తారు.

తనకు పృథ్వీపై ఎలాంటి కక్షా లేదన్నారు. పోరాటం చేస్తున్న అమరావతి రైతుల పట్ల తప్పుగా మాట్లాడినందుకు రైతులకు, రైతు ఆడపడుచులకు భేషరతుగా ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏ మాత్రం నైతికత, వెంకటేశ్వర స్వామిపై గౌరవం ఉన్నా వెంటనే అమరావతి రైతులు, ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని.. అప్పుడే ఆ దేవుడు క్షమిస్తాడని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ అందరినీ సమభావంతో చూస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం భ్రష్టుపట్టిస్తున్నారంటూ పోసాని విమర్శించారు. మరోవైపు ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనబాట పట్టిన రైతులను పెయిడ్‌ ఆర్టిస్ట్‌లుగా పేర్కొంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.
Please Read Disclaimer