కేసీఆర్ ప్రభుత్వానికి భారీ షాకిచ్చిన రాష్ట్రపతి

0

తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భారీ షాకిచ్చారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలంతా మర్చిపోతున్న సమస్యను మళ్లీ గుర్తుచేయడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వానికి బోనెక్కించడానికి తగిన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. కొద్దినెలల కిందట ఇంటర్మీడియట్ పరీక్షల్లో జరిగిన తప్పిదాల కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై స్పందించిన రాష్ట్రపతి ఇప్పుడు దానిపై నివేదిక కోరారు. పెద్ద సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన తెలంగాణ ఇంటర్ బోర్డు తప్పిదాలపై నివేదిక సమర్పించాలని రాష్ట్రపతి కార్యాలయం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు ఆదేశాలు అందాయి.

ఫలితాల్లో దొర్లిన తప్పిదాలు – అవకతవకల కారణంగా ఆత్మహత్య చేసుకున్న 27మంది తెలంగాణ ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సహా మరికొందరు దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం ‘‘తక్షణం వాస్తవాలతో కూడిన నివేదికను అందచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం” అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో లోపాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై అనేక సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇంటర్ బోర్డు వ్యవహారశైలిపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డు వైఫల్యం చెందిందంటూ బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కేంద్ర హోంశాఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని నివేదిక కోరడంపై విపక్షాలు బాలల హక్కుల సంఘాలు సంతోషిస్తున్నాయి.

ఏప్రిల్ నెలలో విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తప్పులు దొర్లాయని ఇంటర్ బోర్డు అధికారులే గతంలో అంగీకరించారు. “ఫలితాలు వెల్లడించడంలో తప్పులు దొర్లాయి. సాఫ్ట్వేర్లో లోపాలు ఉండడంతో సమస్యలు వచ్చాయి. ఓఎంఆర్ షీట్ల బబ్లింగ్ సరిగా జరగలేదు. కొందరికి ప్రాక్టికల్ మార్కులు నమోదు కాలేదు. చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాల్లో మార్పు వల్ల కొన్ని తప్పులు చోటుచేసుకున్నాయి. జంబ్లింగ్ లో కూడా కొన్ని తప్పులు జరిగాయి. సాఫ్ట్ వేర్ లోపంతో కోడింగ్ – డీకోడింగ్ లో కొంత సమస్య తలెత్తింది. బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం” అని అప్పట్లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఫెయిలైన వారందరికీ ఉచితంగా రీవెరిఫికేషన్ – రీకౌంటింగ్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.

అయితే.. ఇప్పుడు రాష్ట్రపతి నేరుగా ఇందులో జోక్యం చేసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం నిజాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మొత్తం బండారం బయటపడితే కేసీఆర్ కు రాజకీయంగా మళ్లీ ఇబ్బంది మొదలుకాక తప్పదు. బీజేపీ తెలంగాణ నేతలు కూడా ఇదే లక్ష్యంతో అట్నుంచి నరుక్కొచ్చినట్లు తెలుస్తోంది.
Please Read Disclaimer