ప్రముఖ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్ అమలులోకి!

0

మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు ఒక విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక బ్యాంక్ తన కస్టమర్ల నుంచి కొత్త చార్జీలు వసూలు చేయడానికి రెడీ అవుతోంది. ఆ బ్యాంక్ మరేదో కాదు ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్. ఈ బ్యాంక్ కస్టమర్లకు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి డబ్బులు కడుతుంటే చార్జీలు విధించడానికి సిద్ధమైంది.

ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ ట్రాన్సాక్షన్లను పెంచాలనే లక్ష్యంతో కొత్త రూల్‌ను అమలు చేయబోతోంది. బ్యాంక్ నుంచి రుణం పొందిన వారు లోన్ ఈఎంఐ కట్టడానికి బ్యాంక్ బ్రాంచుకు వెలితే మాత్రం చార్జీల బాదుడు భరించాల్సిందే. క్యాష్ ట్రాన్సాక్షన్ చార్జీ పేరుతో డబ్బులు వసూలు చేయనుంది. ఈ కొత్త రూల్ సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వస్తుంది.

డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి లోన్ రీపేమెంట్‌ డబ్బులను డిజిటల్ రూపంలో చెల్లించాలని కస్టమర్లను కోరుతున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు పలు డిజిటిల్ ప్లాట్‌ఫామ్స్‌ను అందుబాటులో ఉంచింది. వీటి ద్వారా లోన్ డబ్బులను సులభంగానే చెల్లించొచ్చు.

యూపీఐ, రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్), క్లిక్ టు పే, ఐసీఐసీఐ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూఎస్‌ఎస్‌డీ వంటి పలు రకాల ప్లాట్‌ఫామ్స్ ద్వారా లోన్ డబ్బులు ఆన్‌లైన్‌లోనే చెల్లించొచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. www.icicibank.com/pay ద్వారా నచ్చిన ఆప్షన్ ఎంచుకొని డబ్బులు చెల్లించొచ్చని పేర్కొంది.

ఈఎంఐ డబ్బులను బ్యాంక్‌కు వెళ్లి క్యాష్ రూపంలో చెల్లిస్తే రూ.100 అదనంగా చెల్లించాలి. దీనికి జీఎస్‌టీ అదనం. పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఇలా వివిధ రకాల రుణాలకు ఇది వర్తిస్తుంది. అయితే లోన్ పార్ట్‌పేమెంట్‌కు ఇది వర్తించదు. అలాగే లోన్ ఫోర్‌క్లోజర్ కూడా ఈ చార్జీలు పడవు. వీటికి ఇతర చార్జీలు వర్తించే అవకాశముంది. ఇకపోతే ఈ బ్యాంక్ దారిలోనే మరిన్ని బ్యాంకులు నడిచే అవకాశముంది.