పార్టీ నిట్టనిలువుగా చీలిపోయే డేంజర్ చెప్పారు

0

కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎవరు చేపడతారన్నది ఇప్పుడు పెద్దప్రశ్నగా మారింది. సోనియమ్మ చేతి నుంచి పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ.. వరుస అపజయాల నేపథ్యంలో పార్టీ పగ్గాల్ని వదిలేయటం తెలిసిందే. జట్టు ఓటమి బాట పట్టిన వేళ.. జట్టు కెప్టెన్ గా విజయాల బాట పట్టించే పని మీద దృష్టి పెట్టాల్సిన రాహుల్.. అందుకు భిన్నంగా ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం తెలిసిందే.

ఎంతమంది ఎంతలా కోరినా.. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే నిర్ణయాన్ని మార్చుకునేందుకు తాను సిద్ధంగా లేనని రాహుల్ స్పష్టం చేయటం తెలిసిందే. దీంతో.. పార్టీ బాధ్యతల్ని స్వీకరించే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గాంధీ ఫ్యామిలీకి చెందిన ప్రియాంకకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కోరుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఒకవేళ గాంధీయేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పజెప్పిన పక్షంలో పెను ప్రమాదం పొంచి ఉందన్న మాటను చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని ప్రియాంక స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ.. ఆమె కాకుండా గాంధీయేతర కుటుంబం నుంచి వచ్చిన వారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే పార్టీ నిట్టనిలువునా చీలిపోయే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు.

తమ కుటుంబానికి కాకుండా బయట వ్యక్తులకు పార్టీ పగ్గాల్ని అప్పగించాలన్న నిర్ణయం విషయంలో రాహుల్ తన ఆలోచనను మార్చుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్ లోని ఘోరావల్ గ్రామంలో కాల్పుల బాధితుల్ని కలుసుకునేందుకు వెళ్లినప్పుడు ప్రియాంక ప్రదర్శించిన పట్టుదలను దేశ ప్రజలంతా చూశారని.. ఆమె అనుకున్నది సాధించి వచ్చారన్నారు.

గాంధీ కుటుంబం మాత్రమే కాంగ్రెస్ పార్టీని నడపగలదని.. 134 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు లేకపోవటం దురదృష్టకరంగా అభివర్ణించిన నట్వర్ సింగ్.. పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని గాంధీ కుటుంబ సభ్యులు తప్పించి మరెవరినీ ఊహించుకోలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Please Read Disclaimer