సింధు సత్తా చాటింది!

0

నిజమే… భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తెలుగు అమ్మాయి పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు పుటల్లోకి ఎక్కింది. స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భాగంగా ఆదివారం జరిగిన టైటిల్ సమరంలో సింధు సత్తా చాటింది. వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేసిన సింధు… భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇప్పటిదాకా ఏ ఒక్కరికి సాధ్యం కాని వరల్డ్ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకుని సత్తా చాటింది.

ఇప్పటికే రెండు సార్లు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ ఫైట్ కు చేరిన సింధు.. చివరి మెట్టులో బోల్తా పడింది. వరుసగా రెండు సార్లు తుది సమరంలో ఓటిమిపాలైన సింధు… ఏమాత్రం నిరాశ చెందకుండా… తాజాగా టైటిల్ వేటలో ఫలితం సాధించింది. జపాన్ కు చెందిన క్రీడాకారిణి నజోమీ ఒకుహరపై వరుస గేముల్లో గెలిచింది. కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో సింధు 21-7 – 21-7తో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్ గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకుంది.

భారత బ్యాడ్మింటన్ లో పీవీ సింధు చేరిక కొత్త ఆశలను రేపిన సంగతి తెలిసిందే. అప్పటికే చాలా మంది క్రీడాకారులున్నా… విజయాల పరంగా ఎక్కడికక్కడ బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఇటీవలి ఒలింపిక్స్ లోనూ పతకం సాధించి సత్తా చాటిన సింధుకు… వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ మాత్రం కలగానే మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే.. వరుసగా రెండు పర్యాయాలు టైటిల్ పోరుకు అర్హత సాధించినా… టైటిల్ అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మూడో సారి కూడా టైటిల్ వేటకు సిద్ధమైన సింధు… గతానుభవాలను పునరావృతం చేయకుండా ప్రత్యర్థిని చిత్తు చేసి వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. ఈ టైటిల్ నెగ్గిన తొలి ఇండియన్ ప్లేయర్ గానూ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది.
Please Read Disclaimer