నెల్సన్ మండేలా విగ్రహం చెవిలో కుందేలు బొమ్మ, అది దేనికి సంకేతం?

0

జాతి వివక్షపై పోరాటం చేసిన యోధుడు, దక్షిణాఫ్రికాలో ప్రజలు ఎన్నుకున్న మొట్టమొదటి అధ్యక్షుడు నెల్సన్ మండేలా. 2013 డిసెంబరు 5న ఆయన కన్నుమూశారు. మండేలా సేవలకు గుర్తింపుగా దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో గల యూనియన్ బిల్డింగ్స్ వద్ద తొమ్మిది మీటర్ల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసేప్పుడు చిన్న లోపాన్ని గుర్తించలేకపోయారు. విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఫొటోగ్రాఫర్లు ఆయన చెవిలో కుందేలు బొమ్మను చూసి ఆశ్చర్యపోయారు. మండెలా చెవిలో కుందేలు బొమ్మను ఎందుకు పెట్టారని అంతా జుట్టు పీక్కున్నారు. చాలామంది రకరకాల అర్థాలు వెతకడం ప్రారంభించారు.

వాస్తవానికి నెల్సన్ మండేలాకు, ఆ కుందేలుకు ఎలాంటి సంబంధం లేదు. పైగా, ఆయన ఏ రోజూ కుందేలును పెంచుకోలేదు. దీనిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అధికారి ప్రతినిధి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘మేము ఎప్పుడూ నెల్సన్ మండేలా చెవిలో కుందేలును చూడలేదు. మరి, ఎందుకు పెట్టారో’’ అని తెలిపారు.

ఈ విగ్రహాన్ని తయారు చేసిన ఆండ్రే ప్రిన్సాలూ, రుహాన్ జన్సే వ్యాన్ ఉరెన్‌లు ఆ కుందేలు బొమ్మ వెనుక దాగిన వాస్తవాన్ని చెప్పారు. ఆ కుందేలను తామే ఏర్పాటు చేశామన్నారు. ‘‘విగ్రహంపై ఒక చోట మా పేర్లు రాస్తామని చెబితే ప్రభుత్వం అంగీకరించలేదు. ఇందుకు నిరసనగా విగ్రహం చెవిలో చిన్న కుందేలు బొమ్మ పెట్టాం’’ అని తెలిపారు.

ఆఫ్రికన్లు కుందేలను వేగానికి చిహ్నంగా భావిస్తారు. నెల్సన్ మండేలా చనిపోయిన 11 రోజుల్లోనే ఆర్టిస్టులు ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకు గుర్తుగా చివరిలో కుందేలు బొమ్మని కూడా చెవిలో పెట్టారు. విగ్రహాన్ని చూసిన వెంటనే ఆ బొమ్మ కనిపించదు. బైనాక్యులర్ లేదా లెన్స్ ద్వారా జూమ్ చూసి చూస్తేనే కనిపిస్తుంది.

ఆ యోధుడి విగ్రహం చెవిలో కుందేలు బొమ్మను పెట్టడం ఆయన్ని అవమానించినట్లేనని మండేలా అభిమానులు మండిపడ్డారు. దీంతో విగ్రహం చెవిలోని విగ్రహాన్ని ప్రభుత్వం తొలగించింది. అయితే, ఆ వివాదం మాత్రం ఇంకా ఉనికిలోనే ఉంది. ఈ వివాదం గురించి తెలియని చాలామంది ఇప్పటికీ కుందేలుకు, మండేలాకు ఏమిటి సంబంధం అని ఆలోచిస్తూనే ఉన్నారు.
Please Read Disclaimer