మోదీ న్యూ ఇయర్ షాక్..పెరిగిన రైల్వే చార్జీలు

0

కేంద్రంలోని బీజేపీ సర్కారు న్యూఇయర్ షాక్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా రైల్వే ఛార్జీల పెంపుపై ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. దీన్ని నిజం చేస్తూ…ప్రయాణికుల ఛార్జీలు పెంచుతూ తుది నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ సెకండ్ క్లాస్ – స్లీపర్ క్లాస్ కు కిలోమీటర్ కు ఒక పైసా చొప్పున పెంచాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మెయిల్ సెకండ్ క్లాస్ – స్లీపర్ క్లాస్ – ఫస్ట్ క్లాస్ కు కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెంచారు. ఏసీ ఛైర్ కార్ – ఏసీ 3 – 2 టైర్ – ఏసీ ఫస్ట్ క్లాస్ కు కి.మీ.కు 4 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో చివరి సారిగా రైల్వే ఛార్జీలను పెంచారు. అప్పట్లో ప్రయాణికుల ఛార్జీలు 14.2 శాతం – సరకు రవాణా ఛార్జీలు 6.5 శాతం పెరిగాయి. తాజా పెరుగుదల విషయంలో సబర్బన్ రైళ్లలో మాత్రం చార్జీల పెంపు లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఆదాయం విషయంలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇదిలాఉండగా ఇటీవలే రైల్వే ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ఈ ఏడాది వారికి 78 రోజుల వేతనాన్ని బోనస్ గా చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. క్యాబినెట్ మీటింగ్ తర్వాత ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. సుమారు 11 లక్షల 52వేల మంది రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ఉద్యోగుల్లో ప్రేరణ నింపేందుకు బోనస్ ను ప్రకటిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. తమ ప్రభుత్వం గత ఆరేళ్ల నుంచి రికార్డు స్థాయిలో రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నట్లు మంత్రి జవదేకర్ తెలిపారు.
Please Read Disclaimer