వైసీపీ షోకాజ్ నోటీసుపై ఘాటుగా స్పందించిన రఘురామకృష్ణం రాజు

0

కొంతకాలంగా సొంత పార్టీ వైసీపీపై నిరసన గళం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై వైసీపీ నాయకత్వం ఇటీవలే షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అది చూశాక చర్యలు ఉంటాయని తెలిపింది. తాజాగా ఈ నోటీసుపై ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. వైసీపీ నుంచి తనకు నోటీసు వచ్చిందన్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ తరుఫున నోటీసులు జారీ చేశారని.. వైసీపీ ప్రాంతీయ పార్టీ అని.. దానికి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని.. విజయసాయిరెడ్డి పేరుతో నోటీసులు ఎలా పంపిస్తారని విమర్శించారు.

తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరుఫున గెలిచానని.. వైసీపీ పేరు మారిందా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నోటీసుకు చట్టబద్ధత లేదని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.

తాను ఏ నాడు తమ పార్టీని పార్టీ అధ్యక్షుడు జగన్ ను పల్లెత్తు మాట అనలేదని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రజల కోసం చేపట్టిన పథకాలు అనుకున్నట్టుగా జరగడం లేదని.. సీఎంకు చెప్పాల్సిన అవసరం ఉందని ఒక వీడియో రిలీజ్ చేశారు. సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. శుక్రవారమే వివరణ పంపిస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వైసీపీలో అసలు క్రమశిక్షణ సంఘం లేదని.. దానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు. మొత్తంగా రఘురామకృష్ణం రాజు తీరు చూస్తుంటే తనకు షోకాజ్ ఇచ్చిన సొంత పార్టీపైనే రివర్స్ అటాక్ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.