జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా? తాజాగా షాకింగ్ పరిణామాలు

0

జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా? హడావుడిగా తమిళనాడు నుంచి ఏపీకి వచ్చిన ఈ పెద్ద మనిషికి ఎదురైనన్ని ఇబ్బందులు అన్నిఇన్ని కావు. ఏపీ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ ఎపిసోడ్ లో.. ఆయన్ను హటాత్తుగా తీసుకురావటం.. కీలక పదవిని అప్పజెప్పటం తెలిసిందే. నిమ్మగడ్డ న్యాయపోరాటంతో.. ఆయనే మరోసారి ఏపీ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇదంతా తెలిసిన ముచ్చట.

తాజాగా ఎవరికి తెలీని కొత్త విషయాలు అనూహ్యంగా బయటకు వచ్చాయి. బెజవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలోని ల్యాండ్ మార్క్ ఫ్రైడ్ అపార్ట్ మెంట్ లోని డి-3 ఫ్లాట్ ను కనగరాజ్ కు నివాస వసతి కల్పించారు. నెలకు రూ.1.11లక్షల అద్దె ఇచ్చే ఒప్పందంతో ఆ ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నారు. ఆర్నెల్లుగా ఆ ఇంటికి చెల్లించాల్సిన అద్దెను చెల్లించని పరిస్తితి. ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆ నియామకం సరికాదంటూ హైకోర్టు కొట్టేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆ ఇంట్లోని ఫర్నీచర్ ను అధికారులు తరలించే ప్రయత్నం చేశారు. దీనికి ఇంటి యజమాని రవీంద్రనాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు చెల్లించాల్సిన బకాయిల్ని తిరిగి చెల్లించిన తర్వాతే ఫర్నీచర్ తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో.. రవీంద్రనాథ్ పై మాచవరం పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గడిచిన ఆర్నెల్లుగా తనకు రూ.7లక్షల వరకు అద్దె బకాయిలు ఉన్నారని.. అధికారులు ఎవరూ స్పందించటం లేదన్నారు.

తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని.. సాధారణ ప్రజల్లో ఒకడినన్న ఆయన.. అద్దె చెల్లించకుండా ఇబ్బంది పెట్టటం సరికాదన్నారు. అగ్రిమెంట్ లెటర్ ఇచ్చి.. ఫర్నీచర్ తీసుకెళ్లొచ్చని.. మిగిలిన విషయాలు కోర్టులో చూసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో.. అధికారులు ఫర్నీచర్ తీసుకోకుండానే వెనక్కి వెళ్లిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో తనకేమాత్రం సంబంధం లేకుండా జస్టిస్ కనగరాజ్ పేరు రావటం చూసినోళ్లు.. అయ్యో పెద్ద మనిషి పేరు తరచు ఇలాంటి విషయాల్లో రావటమా? అన్న మాట వినిపిస్తోంది.