కేసీఆర్ ను జైల్లో పెట్టేందుకు భలే లాజిక్ చెప్పిన ఫైర్ బ్రాండ్

0

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ కు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ.. తరచి చూస్తే.. ఇద్దరిలో ఒక పోలిక కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. కేసీఆర్ ఎలా అయితే తన మాటలతో.. లాజిక్కులతో ఎదుటివారిని కట్టి పారేస్తారో.. సరిగ్గా అదే తీరు రేవంత్ లోనూ కనిపిస్తుంటుంది.

కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తన ప్రత్యర్థుల్ని ఉతికి ఆరేస్తుంటే.. అవును కదా? అన్నట్లు అనిపించక మానదు. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ను సైతం కవర్ చేసే అవకాశం లభిస్తే.. కేసీఆర్ కు ధీటుగా ఆయన వ్యాఖ్యలు వినిపిస్తాయి. ఇలాంటి తీరు తెలంగాణలో మరే నేతలోనూ కనిపించదు.

కేసీఆర్ మాదిరే పిట్టకథలు.. ఉదాహరణలు.. బూతులతో ప్రత్యర్థులపై విరుచుకుపడే గుణం రేవంత్ లోనూ కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ విరుచుకుపడుతున్నారు. 48వేల మంది ఉద్యోగులకు ఇప్పుడు సంస్థలో ఉన్నది కేవలం 1200 మందే అంటూ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చట్టబద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మెకు దిగిన కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన తీరు సరిగా లేదన్న ఆయన.. ఆరేళ్లుగా సచివాలయానికి రాని సీఎంపైన పీడీ యాక్ట్ ప్రయోగించి.. అండమాన్ జైల్లో పెట్టాలా? అని ఆయన ఫైర్ అయ్యారు.

విచారణకు రాబోయే కేసుల గురించి మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లే కేసీఆర్.. తాము సమ్మె చేస్తామని 35 రోజుల ముందే నోటీసులు ఇచ్చిన కార్మికుల్ని పిలిచి మాట్లాడేందుకు టైం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాట యోథుల్లా కనిపించిన వారు ఇప్పుడు బానిసలు.. కుక్క తోకలుగా కనిపిస్తారా? అని మండిపడ్డారు. సమ్మె చేస్తున్న 48 వేల మంది ఉద్యోగుల్లో ఏ ఒక్కరి ఉద్యోగాన్ని కేసీఆర్ తీయలేరన్నారు. విధులకు హాజరు కాని ఉద్యోగుల ఉద్యోగం లేదని చెప్పేసిన కేసీఆర్ మాటకు.. సచివాలయానికి వెళ్లని సీఎం అంటూ ఎద్దేవా చేసిన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
Please Read Disclaimer