కేసీఆర్ అప్పుడేమన్నారు.. ఇప్పుడు పరిస్థితేంటి?: రేవంత్ రెడ్డి ఫైర్

0

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఉద్యోగాలను ఫణంగా పెట్టి ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నాడు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేలాది మంది ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర సాధన కోసం పోరాడారన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ పలు సందర్భాల్లో పొగిడిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని కేసీఆర్ హామీ ఇచ్చారన్న రేవంత్ రెడ్డి.. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు. ‘‘అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలే ఉండకూడదని.. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యమ సమయంలో కేసీఆర్ పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. తీరాం సీఎం అయ్యాక ఊసరవెల్లిలా రంగులు మార్చార’’ని రేవంత్ ఘాటుగా విమర్శించారు.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంగతి పక్కనబెడితే.. ప్రభుత్వ పర్యవేక్షణలోని ఆర్టీసీ కార్మికులను సైతం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని టీఆర్ఎస్ సర్కారును రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఆర్టీసీ ఉద్యోగులను కేసీఆర్ బెదిరించడం సరికాదన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులకు సమ్మె తప్ప మరో మార్గం లేదన్నారు. గత ఐదేళ్లలో ఒక్కసారైనా ఆర్టీసీ కార్మికుల కష్టాలను తెలుసుకోవడానికి టీఆర్ఎస్ సర్కారు ప్రయత్నించలేదన్నారు. ఆర్టీసీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాదన్న రేవంత్ రెడ్డి.. ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేయడం సరికాదన్నారు.
Please Read Disclaimer