ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి

0

ఖమ్మంలో ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన శనివారం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. 90 శాతానికి పైగా శరీరం కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తీసుకొచ్చారు. కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందారు. ఆర్టీసీ డ్రైవర్‌ మృతి నేపథ్యంలో ఆస్పత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనివాస్‌రెడ్డి మృతికి ప్రభుత్వమే కారణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు

2009 డిసెంబరు ఒకటిన హైదరాబాద్ శివారులో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రీకాంతాచారి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తన చావుతోనైనా తెలంగాణ సాధిస్తే అదే పదివేలు అంటూ తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఆ తర్వాత దాదాపు 1200 మంది తెలంగాణ సాధన కోసం అమరులయ్యారు. పదేళ్ల అనంతరం ఉద్యమ శ్రీకాంతాచారి బలిదానాన్ని గుర్తుకు తెచ్చేలా ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది.

చీకూ చింతా లేని కుటుంబంతో పాటు.. ఆర్థికంగా బలమైన నేపథ్యమున్న ఆయన.. తన తోటి ఉద్యోగుల కోసం.. న్యాయమైన తమ డిమాండ్లను సాధించుకునేందుకు ఆత్మబలిదానానికి సైతం వెనుకాడని వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉద్యమ సమయంలో పాపిష్టి సీమాంధ్ర పాలకుల కారణంగా తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారని.. వారి ఊసురు తగలకమానదని అప్పట్లో ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ నిప్పులు చెరిగేవారు.

ఇప్పుడు తన పాలనలో.. తాను తీసుకున్న నిర్ణయాలపై నిరసనగా ఆత్మాహుతికి ప్రయత్నించిన వైనం.. శ్రీకాంతాచారిని గుర్తు చేయటమే కాదు.. సొంత రాష్ట్రంలో సొంత పాలకుల నిర్ణయాల కారణంగా ఆత్మాహుతి వరకూ వెళ్లేలా ప్రభుత్వం ఎందుకంత మొండిగా వ్యవహరిస్తోందన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది.

బాధ కలిగించే అంశం ఏమంటే.. శ్రీనివాసరెడ్డి ఇంట మనమడి బారసాల శుక్రవారం జరిగింది. ఆర్మీలో పని చేస్తున్న ఇద్దరు కొడుకుల్లో ఒకరు శనివారం తిరిగి విధుల్లో చేరేందుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి వేళ.. ఇంటి బయట తనకు తాను నిప్పు పెట్టుకోవటం ఒక ఎత్తు అయితే.. శరీరం మొత్తం కాలిపోయి.. తీవ్ర బాధను అనుభవిస్తూ కూడా.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని కోరుకోవటం సహచరుల్ని భావోద్వేగానికి గురి చేస్తోంది.

ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోవాలని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆయన నోటి నుంచి వస్తున్న మాటల్ని వింటే.. సహచర కార్మికుల కోసం ఆయన పడిన తపన కళ్లు చెమర్చేలా చేయటమే కాదు.. ఆశయ సాధన కోసం ఎంతవరకైనా వెళ్లాలన్న భావన కలిగేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సొంత రాష్ట్రంలో సొంత పాలనలో పదేళ్ల క్రితం శ్రీకాంతాచారి మాదిరి.. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి తనను తాను కాల్చేసుకునే వరకూ విషయం ఎందుకు వెళుతోంది కేసీఆర్? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.
Please Read Disclaimer