గంగూలీతో బీజేపీ రాజకీయం.. షాకిచ్చిన దాదా!

0

పశ్చిమ బెంగాల్ లో బలోపేతం కావాలనేది భారతీయ జనతా పార్టీ ప్రణాళిక. ఇప్పుడు బీజేపీ తన పూర్తి ఆసక్తులన్నింటినీ బెంగాల్ మీదే పెట్టుకుంది. త్వరలోనే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ సానుకూల ఫలితాలే పొందింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగా సమాయత్తం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. అక్కడ రాజకీయం కోసం బీజేపీ చాలా పన్నాగాలనే రెడీ చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

అందులో భాగంగానే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి బీజేపీ ప్రాధాన్యతను ఇస్తోందని వార్తలు వస్తున్నాయి. గంగూలీని ఏకంగ్రీవంగా బీసీసీఐ ప్రెసిడెంట్ గా చేసేందుకు బీజేపీ సహకారం అందించిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే అమిత్ షా- గంగూలీల సమావేశం ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆయన మద్దతు పలికేలా అమిత్ షా ఒప్పించారని అందుకే ఆయనకు బీసీసీఐ పగ్గాలను అప్పగిస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. అమిత్ షా- గంగూలీల మధ్య ఆ డీల్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై పూర్తిగా స్పందించేశాడు గంగూలీ.

మొహమాటం లేకుండా మాట్లాడే సౌరవ్.. తను బీజేపీతో ఎలాంటి రాజకీయ ఒప్పందాన్నీ చేసుకోలేదన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ప్రసక్తి లేదన్నాడు. అమిత్ షాతో సమావేశంలో అలాంటి ఒప్పందాలు చేసుకోలేదని కుండబద్ధలు కొట్టాడు. అంతే కాదు… తను బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నందుకు తనను అభినందించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా దాదా కృతజ్ఞతలు తెలిపాడు. అలా మమతా దీదీతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయనే సంకేతాలను ఇచ్చాడు సౌరవ్ దాదా!
Please Read Disclaimer