చివరికి ముగ్గులోకి దింపారు.. రైతుల ప్రయత్నం అదుర్స్!

0

అమరావతి రైతులు వినూత్న నిరసనలతో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. తమకు చావే శరణ్యమని.. మరణించడానికి అనుమతి ఇవ్వాలని కొంత మంది రైతులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ఇదిలా ఉండగా.. కొత్త సంవత్సరం నేపథ్యాన్ని కూడా అమరావతి మహిళలు తమ నిరసనలకు వాడుకున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమరావతి లోగిళ్లలో ప్రత్యేక ముగ్గులు వెలిశాయి. పలువురు మహిళలు ముగ్గులు వేసి తమ నిరసన తెలిపారు. ఇళ్ల ముందు రంగవల్లికలు తీర్చిదిద్ది ‘సేవ్ అమరావతి, సేవ్ ఏపీ’ అంటూ రాశారు.

రైతు కంట కన్నీరు, తల్లి కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని మహిళలు హితవు పలికారు. ‘అమరావతే మా రాజధాని’ అని మరికొంత మంది ప్రకటించారు.

ఇంకొంత మంది రైతులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసనలు దేశం దృష్టిని ఆకర్షించేలా చేసే క్రమంలో గొప్ప ముందడుగు వేశారు.

14 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. తమ గోడు వినిపించుకునే వారే లేరని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తమపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే తమపై కక్షగట్టిందని.. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంతో ఉన్నపళంగా రోడ్డున పడ్డామని గోడు వెల్లబోసుకున్నారు.

ముఖ్యమంత్రి, కొందరి స్వలాభం కోసమే రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఓ మంచి కార్యం కోసం తాము చేసిన త్యాగాలకు దక్కిన ఫలితం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు.
Please Read Disclaimer