బీజేపీకి టర్మ్స్ డిక్టేట్ చేసిన శివసేన..

0

ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని ఊరికే అనలేదేమో? మోడీషాలకు ఇప్పుడీ సామెత గుర్తుకు రావటం ఖాయం. దేశ రాజకీయాల్లో శివసేనకు మించిన పర్ ఫెక్ట్ మిత్రపక్షం బీజేపీకి దొరకదనే చెప్పాలి. కానీ.. మిత్రుడ్ని ముంచేసే ప్లాన్లు వేసినప్పటికి పంటి బిగువునా ఓర్చుకున్న వారికి ఇప్పుడు సరిగ్గా అవకాశం చిక్కింది. మామూలుగా అయితే.. శివసేన తీరు ఇలా ఉండేది కాదేమో కానీ.. గడిచిన ఐదారేళ్లుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ తీరులో చాలానే మార్పు వచ్చింది.

గెలిచి ఓడటం లాంటి విచిత్రమైన పరిస్థితిని బీజేపీ మహారాష్ట్రలో ఎదుర్కొంటోంది. మిత్రుడైన శివసేనతో కలిసి బరిలోకి దిగిన బీజేపీకి ఓటర్లు కాసింత షాకిచ్చారని చెప్పాలి. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 21 స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు తగ్గారు. అదే సమయంలో శివసేనకు గతంతో పోలిస్తే.. ముగ్గురు ఎమ్మెల్యేలు తగ్గారు. అంటే.. వీరిద్దరూ కోల్పోయిన ఎమ్మెల్యేల్ని విపక్షాలు సొంతం చేసుకున్నట్లే. అంటే.. అంత మందంలో ఎన్సీపీ లాభపడింది. గతంలో తనకు మించి అధిక్యంలో ఉన్న బీజేపీతో బేరసారాలు ఆడే స్థాయి లేక.. అదే సమయంలో ఏమీ చేయలేక ఉండిపోయిన శివసేనకు ఇప్పుడు సరిగ్గా అవకాశం లభించిన పరిస్థితి.

288 స్థానాలున్న మహారాష్ట్రలో కేవలం 101 స్థానాల్లో మాత్రమే బీజేపీ అధిక్యత ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేన పాత్ర చాలా కీలకం. అదే సమయంలో ఎన్సీపీ.. కాంగ్రెస్ నుంచి కూడా ఓపెన్ ఆఫర్లు రావటంతో బీజేపీ అలెర్ట్ అయ్యింది. తాజా పరిస్థితిలో తనకు పెరిగిన పరపతిని గుర్తించిన శివసేన బీజేపీ అధినాయకత్వానికి తనకున్న డిమాండ్లను పంపింది.

ఉమ్మడిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి రావటం.. అలాంటి పరిస్థితుల్లో సీఎం పదవీ కాలాన్న చెరిసగం పంచుకోవాలన్న ప్రతిపాదనను మోడీషాలకు పంపింది శివసేన. అంతేకాదు.. తొలుత ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం తమకే ఇవ్వాలని.. ఆదిత్యఠాక్రేకు పదవిని కట్టబెట్టాలన్న కండీషన్ నుపంపినట్లుగా తెలుస్తోంది.

ఎంత స్నేహితుడైనా వంగతోట వరకే అన్నట్లుగా.. అధికారాన్ని అప్పగించటం..కీలక పదవులు ఇచ్చే విషయంలో పరమ పీనాసిగా వ్యవహరించే మోడీషాలకు.. శివసేన పంపిన టర్మ్స్ కు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శివసేన చేసిన ప్రతిపాదనలకు మారు మాట్లాడకుండా మోడీషాలు ఓకే చెబుతారా? లేదంటే.. కొత్త పరిణామాలకు దారి తీసేలా వ్యవహరిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Please Read Disclaimer