యువతిని రేప్ చేసిన ఎస్సై.. తల్లిని లాడ్జికి రమ్మన్న కానిస్టేబుల్.. గుంటూరులో కీచకపర్వం

0

ప్రేమపేరుతో మోసపోయిన యువతి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కెంది. అక్కడ కూడా ఆమె వంచనకు గురైంది. బాధితురాలికి న్యాయం చేయాల్సిన ఓ ఎస్సై ఆమెపై కన్నేశాడు. తన కోరిక తీరిస్తే కేసులో సాయం చేస్తానని నమ్మించి.. బెదిరించి.. యువతిని లొంగదీసుకున్నాడు. నిస్సహాయురాలైన ఆమె అతని అధికారానికి తలవంచక తప్పలేదు. ఆమె తల్లిపై కన్నేసిన కానిస్టేబుల్ ఏకంగా లాడ్జికే రమ్మన్నాడు. ఈ ఘోరమైన ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగుచూసింది.

నగరంలోని చుట్టుగుంట సెంటర్.. శివరామ్‌నగర్ కాలనీకి చెందిన దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె సంతానం. కొద్దికాలం క్రితం తండ్రి మరణించడంతో తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. గతంలో శారదా కాలనీలో నివాసం ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన డేవిడ్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ కూతురు వెంట పడేవాడు. ఆమె కూడా అతనిని ప్రేమించింది. ఇద్దరూ కలిసి కొద్దికాలం తిరిగారు. అనంతరం పెళ్లి విషయం ఎత్తడంతో ముఖం చాటేశాడు.

పెద్దల సమక్షంలో ఒప్పందం జరిగినా పట్టించుకోకుండా యువతిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతిపై కన్నేసిన ఎస్సై ఆమెను ఎలాగైనా లోచరుచుకునేందుకు ప్రియుడు డేవిడ్ కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాడని.. మిమ్మల్ని కూడా జైలుకు పంపాల్సి వస్తుందని భయపెట్టాడు. ఓ రోజు రాత్రి సడెన్‌గా ఇంట్లోకి వచ్చి తలుపు గడియ పెట్టేశాడు. తన కోరిక తీరిస్తే కేసులో సాయం చేస్తానని నమ్మించి లోబరుచుకున్నాడు.

ఎస్సై వెంట ఉన్న కానిస్టేబుల్ ఆమె తల్లిని వేధింపులకు గురిచేశాడు. ఏకంగా లాడ్జికి రమ్మని అడిగాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో నగదు డిమాండ్ చేశాడు. ఈ మేరకు తల్లీకూతుళ్లు గుంటూరు అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. కూతురిపై ఎస్సై అత్యాచారానికి పాల్పడ్డాడని.. తమకు న్యాయం చేయాలని బాధితులు ఎస్పీని కోరారు.