‘సోన్ భద్ర’ దారుణం ఏ స్థాయిదో చెప్పే వీడియో ఇది!

0

సోన్ భద్ర ఘటన… దేశాన్ని ఊపేసిన దారుణ ఘటన. ఉత్తరప్రదేశ్ లో వారం క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనలో భూస్వాముల భూదాహానికి 10 మంది రైతులు మరణించారన్న విషయం మాత్రమే మనకు తెలుసు. ఆ ఘటనలో అసలు భూస్వామ్య వర్గానికి చెందిన మూక రైతులపై ఎలా దాడిచేసింది? భూస్వామి స్వయంగా రంగంలోకి దిగి ఏం చేశారు? రైతులపై ఎలాంటి దాష్టీకాలకు పాల్పడ్డాడు? భూస్వాముల దాడితో రైతాంగం ఏ రీతిన వణికింది? భయంతో పరుగులు తీసిన రైతులపై భూస్వామ్య మూక ఎలా దాడి చేసింది? అన్న విషయాలు ఇప్పటిదాకా మనకు తెలియవు. అయితే ఈ విషయాలన్నింటినీ మన కళ్లకు కట్టేలా ఓ వీడియో వచ్చేసింది. గత వారం జరిగిన ఈ ఘటనకు సంబంధించినదిగా భావిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ కే వైరల్ గా మారిపోయింది.

కేవలం 36 ఎకరాల భూమి కోసం ఏకంగా 10 మందిని పొట్టనబెట్టుకున్న అక్కడి గ్రామ పెద్ద… ఏకంగా 200 మందిని రైతుల పైకి పంపారు. పొలం పనుల్లో నిమగ్నమైన రైతులు… భూస్వామి గూండాలను చూసి పరుగులు పెడుతుంటే… రాక్షసానందంతో వారి వెంట పడి ఆ ముఠా సాగించిన దారుణం ఈ వీడియోలో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిన ఈ వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే… ఉత్తరప్రదేశ్ – సోన్ భద్ర జిల్లా ఘొరావల్ ప్రాంతంలోని ఉంభా ప్రాంతంలో గతవారం జరిగిన భూ వివాదంలో పదిమంది రైతులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 32 ట్రాక్టర్లలో 200 మందికిపైగా వచ్చిన గ్రామపెద్ద వర్గం వ్యక్తులు రైతులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు చావబాదారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా అరుపులు – కేకలు – తుపాకి మోతలతో హోరెత్తిపోయింది. రైతులను కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు. వారి తలలు పగలగొట్టారు. కిందపడిన వారిని కాళ్లతో తొక్కుకుంటూ కర్రలతో చితకబాదడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తుపాకి కాల్పుల్లో ముగ్గురు మహిళలు సహా 9మంది రైతులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి గ్రామ పెద్ద యజ్ఞదత్ అని భావిస్తున్నారు. యజ్ఞదత్ స్వయంగా తుపాకితో రైతులపై కాల్పులు జరపడం ఈ వీడియోలో రికార్డైంది.

ఇక ఈ ఘటనకు దారి తీసిన కారణాలను ఓ సారి పరిశీలిస్తే… 36 ఎకరాల భూమిని తమకు కేటాయించాలంటూ గత కొంత కాలంగా దళిత – గిరిజన రైతులపై ఊరిపెద్ద యజ్ఞదత్ సహా కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయినప్పటికీ వారు వినలేదట. దీంతో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు యజ్ఞదత్ యత్నించారు. ఈ నెల 17న తన మనుషులతో ట్రాక్టర్లలో భూమి వద్దకు చేరుకుని పొలం పనులు చేసుకుంటున్న రైతులను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. రైతులు ప్రతిఘటించడంతో తుపాకులు ఎక్కుపెట్టి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో అప్ లోడ్ కావడంతో ఈ ఘటనపై పెద్ద దుమారమే రేగుతోంది.
Please Read Disclaimer