నీరవ్ కంటే ముదుర్లు ఈ బ్రదర్స్..భారీ స్కాం బయటకు!

0

బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ భారీగా దెబ్బ తీస్తున్న వైనం ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఉదంతంలో బయటకొచ్చి సంచలనం సృష్టించింది. తాజాగా మరో కొత్త కుంభకోణం వెలుగు చూసింది.ఈ స్కాం చూస్తే.. నీరవ్ మోడీ చేసిన మోసానికి మించిందిగా దీన్ని చెప్పాలి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను రూ.12వేల కోట్ల వరకు నీరవ్ మోడీ ముంచేస్తే.. తాజాగా బయటకొచ్చిన కుంభకోణంలో రూ.14వేల కోట్ల మేర వివిధ బ్యాంకుల్ని మోసగించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. గుజరాత్ కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ ప్రమోటర్లు అయిన సందేసరా సోదరులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నారు.

ఈ బ్రదర్స్ ఎంత ముదుర్లు అంటే.. వివిధ బ్యాంకులకు టోపీ పెట్టి ఏకంగా రూ.14వేల కోట్ల మేర దోచేసిన వైనాన్ని గుర్తించారు. స్టెర్లింగ్ కంపెనీ.. దాని ప్రమోటర్లు అయిన నితిన్ సందేసరా.. చేతన్ సందేసరా.. దీప్తి సందేసరాలు బ్యాంకు నుంచి భారీగా అప్పలు తీసుకున్నారు. 2017లో వీరు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.5393 కోట్ల అప్పుల లెక్కపై ఈడీ.. సీబీఐ కేసులు నమోదు చేసింది.

ఈ కేసుల్ని దర్యాప్తు చేస్తున్న అధికారులకు కొత్త విషయాల్ని గుర్తించారు. దేశీయ బ్యాంకుల నుంచే కాదు.. విదేశాల్లోని భారతీయ బ్యాంకుల బ్రాంచీల నుంచి సందేసరా గ్రూపు రూ.9 వేల కోట్ల మేర రుణాలు తీసుకున్న విషయాన్ని గుర్తించారు.

వీరి మోసాలకు బాధితులుగా మారిన బ్యాంకుల జాబితాలో ఆంధ్రా బ్యాంక్.. యూకో బ్యాంక్.. ఎస్ బీఐ.. ఆలహాబాద్ బ్యాంక్ తో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితరాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ బ్యాంకులన్ని ప్రభుత్వ బ్యాంకులు కావటం గమనార్హం. తప్పుడు పత్రాలతో రుణాలు తీసుకున్న వారు.. వాటిని తమ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నట్లుగా గుర్తించారు. అక్రమ పద్దతిలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో విదేశాల్లో భారీ ఎత్తున ఆస్తుల్ని కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తించారు. ఈ లెక్కన జాతీయ బ్యాంకులు ఎంతలా ఇలాంటి మోసాలకు మునిగాయి? అన్న సందేహం ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తోందని చెప్పక తప్పదు.
Please Read Disclaimer