నా బిడ్డ చావుకు జీహెచ్ ఎంసీనే కారణం..హైకోర్టుకెళ్తా: సుమేధ తండ్రి

0

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆడుకోవడానికి వెళ్లిన నేరేడ్ మెట్ దీన్ దయాల్ కాలనీకి చెందిన బాలిక సుమేధా కపూరియా నాలాలో పడి చనిపోయిన ఘటన విషాదం నింపిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సుమేధా ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బాలిక సుమేధ వెళ్లిన ప్రాంతంలో నాలాలు భారీగా పొంగి పొర్లాయని స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు ఆ దిశగా గాలింపు చేపట్టారు. నాలాలో ప్రమాదవశాత్తూ పడిపోయిందన్న అనుమానంతో శుక్రవారం ఉదయం నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది రెస్క్యూ టీం వెతకగా చివరికి నాలా సమీపంలో ఉన్న బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది.

తాజాగా సుమేధ అంత్యక్రియలు ముగిశాయి. పోస్టు మార్టం రిపోర్టులో కీలక విషయం బయటపడింది. నాలాలో పడిపోవడంతో సుమేధా తలకు బలమైన గాయం తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని తేలింది. అనంతరం ఊపిరితిత్తుల్లోకి నీరు చేసి శ్వాస అందక చనిపోయినట్లు వెల్లడైంది.

కాగా అధికారుల నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని సుమేధ తండ్రి ఆరోపించారు. తాను చిన్నప్పటి నుంచి నా కూతురిపై చేయి కూడా చేసుకోలేదని.. అలాంటిది నాలాలో పడినప్పుడు ఎంత నరకం అనుభవించి ఉంటుందో అని కన్నీరుమున్నీరైంది. తన కుమార్తెలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని. నాలా వద్ద ఎలాంటి రక్షణలు లేవని.. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై తాను హైకోర్టులో పిటీషన్ వేస్తానని సుమేధ తండ్రి తెలిపారు.