స్వామీజీలు.. ఈ రేంజ్ విలాసాలా..!

0

భారతీయ తత్వంలో సన్యాసం ఉంది. ప్రత్యేకించి హిందూయిజంలో సన్యాసానికి ఎంతో ప్రాముఖ్యత. అన్నింటినీ త్యజించి.. సన్యాసం తీసుకునే వారికి సామాన్యుల్లో చాలా గౌరవం ఉంటుంది. వారిని దేవుడి ప్రతినిధులుగా చూసే తత్వం ఉంది హిందువుల్లో. కాషాయం ధరించి – కుటుంబ బాధ్యతలకు – అన్ని భోగాలకు దూరంగా ఉండే సన్యాసులకు – వారు చెప్పే ప్రవచనాలకు ఎంతో గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని చాలా మంది నిలుపుకుంటూ ఉంటారు.

వారు రకరకాల సేవలను అందిస్తూ ఉంటారు. ఆ సేవలకు సంతోషించి బాగా డబ్బులు ఉన్న వారు వారికి విరాళాలు ఇస్తూ ఉంటారు. ఆ సేవలను మరింత విస్తరించడానికే బోలెడన్ని విరాళాలూ వస్తున్నాయి. అలాంటి విరాళాలతో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించే వారు ఎంతో మందిని మనం గమనిస్తూ ఉంటాం.

అయిఏత కొందరు యోగులుగా మారినట్టుగా ప్రకటించుకుని – భోగులుగా కొనసాగుతూ ఉంటారు. అలాంటి వారినీ ఎంతోమందిని మనం గమనించవచ్చు కూడా. ఆఖరికి కొందరు స్వామీజీలు శృంగార లీలలతో కూడా వార్తల్లోకి ఎక్కారు. లైంగిక వేధింపులకు పాల్పడి జైలు శిక్షలను ఎదుర్కొంటున్న స్వామీజీలు కూడా ఉన్నారు.

అయినా మన దగ్గర వారి పై నమ్మకాలకూ – గౌరవానికి ఎలాంటి కొదవా లేదు. కొందరు స్వామీజీలు పక్కాగా పట్టుబడినా.. ఆ తర్వాత వారు జైళ్ల నుంచి బయటకు వచ్చి – మళ్లీ భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు. తామే దేవుళ్లమని చెప్పుకుని తిరుగుతూ ఉన్నారు.

అలాగే రాజకీయాల మీద కూడా వారి ప్రభావం ఉంది. చాలా రాష్ట్రాల్లో అయితే స్వామీజీలు ఎటు చెబితే జనాలు అటు ఓటేస్తారనే పేరు కూడా ఉంది. అందుకే స్వామీజీల ఆశీస్సుల కోసం రాజకీయ నేతలు క్యూ కడుతూ ఉంటారు కూడా.

ఆ సంగతలా ఉంటే.. స్వామీజీల విలాసాలు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న కొందరు స్వామీజీల వైభోగం అలాగిలాగా ఉండదు. వారి దగ్గర అత్యంత లగ్జరీ కార్లున్నాయి. రాజకీయాల వైపు కూడా చూస్తున్న ఒక స్వామీజికి అయితే ఏకంగా ఒక బీఎండబ్ల్యూ – మరో బెంజ్ – ఇంకో పోర్షే.. ఇన్ని కార్లున్నాయట. ఆయన పేరుకేమో సన్యాసి – పరిత్యాగి. ఎక్కిదిగేది మాత్రం లగ్జరీ కార్లలో అంటూ చాలా మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు.
Please Read Disclaimer