గెలుపు కోసం డబ్బు తీసుకొని ఎమ్మెల్యే శ్రీదేవి ఎగ్గొట్టిందా?

0

ఏపీ ఎన్నికల సమయం అది. 10ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలకు టీడీపీతో పోల్చితే డబ్బు అవసరం చాలా ఉంటుంది. ఎమ్మెల్యేగా పోటీచేయాలంటే కోట్లు ఖర్చు బెట్టాల్సిందే. ఆ క్రమంలోనే అప్పు చేసి గెలిచిన ఎమ్మెల్యే ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చిందని ఓ వైసీపీ నేత ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశాడు. ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏంటా కథ? వివాదం వెనుక ఏమిటసలు తెలుసుకుందాం..

గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.ఎన్నికల సమయంలో తన వద్ద అప్పు తీసుకుందని.. తిరిగి ఇవ్వడం లేదని వైసీపీ నేత మేకల రవి సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. ఈ వీడియో విడుదల చేయడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది.

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి.. ఎన్నికల వేళ తన వద్దకు వచ్చి ‘తన భర్త మోసం చేశాడని.. రూ.1.40 కోట్లు అప్పుగా తీసుకుందని’ మేకల రవి తెలిపాడు. గెలిచాక రూ.40 లక్షలు తిరిగి ఇచ్చిందని.. మిగతా రూ.80 లక్షలు అడిగితే బెదిరిస్తోందని చెబుతున్నాడు.

ఇక రూ.80 లక్షల అప్పు తీర్చమంటే డీసీఎంఎస్ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు సరిపెట్టుకోవాలని అంటోందని మేకల రవి ఆరోపిస్తున్నాడు. డబ్బు కోసం ఎమ్మెల్యే శ్రీదేవి ఇంటికి వెళితే దుర్భాషలాడిందని.. ఎస్పీకి ఫోన్ చేసి లోపల వేయిస్తానంటూ బెదిరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే శ్రీదేవి బెదిరింపులపై సీఎం జగన్ దృష్టి పెట్టాలని మేకల రవి కోరాడు.

ఇలా వైసీపీలోని అంతర్గత వ్యవహారం ఇప్పుడు బయటపడి రచ్చ రచ్చ అవుతోంది. వైసీపీ నేతలంతా గెలుపు కోసం ఇలా అప్పులు చేసి ఇప్పుడు తిప్పలు పడుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళుతుండడంతో పైసా పుట్టక ఇలా అవస్థల పాలు అవుతున్నారని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతైనా వైసీపీ నేతల సీతకష్టాలు చూసి ఇప్పుడు నేతలంతా అయ్యో పాపం అంటున్నారట..