అంతా నా ఇష్టం..! ఆ మంత్రితీరే వేరు..!

0

ఆయన మంత్రి. రెండు శాఖలు మాత్రమే ఆయన చేతిలో ఉన్నాయి. కానీ.. అన్నింటినీ ఆయనే చూసుకుంటారు. సమీక్షలు – సమావేశాలు.. ఇలా ఏది జరిగినా.. అంతా నా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రథమ పౌరుడు మేయర్ ను కూడా పక్కన పెట్టేసి.. తాను చెప్పిందే వేదం.. తాను చేసిందే పని అంటూ.. దూకుడుగా.. దుందుడుకుగా ఉంటున్నారు. పార్టీ అధిష్ఠానం వద్ద పలుకుబడిని ఉపయోగించి – తనకు ఎదురేలేదు.. అన్నట్టుగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన వ్యవహారశైలితో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. మిగతా ఎమ్మెల్యేలు – నాయకులు అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరని అనుకుంటున్నారా..? ఆయన మరెవరో కాదు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గ్రేటర్ హైదరాబాద్ లో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ చేయాల్సిన సమీక్షలూ మంత్రి తలసానే చేస్తున్నారు. కనీసం.. మేయర్ కు సమాచారం కూడా ఇవ్వడం లేదట. పార్టీ కార్యక్రమాలు అయినా.. ప్రభుత్వ కార్యక్రమాలు అయినా.. అన్నింటి తలసాని పెత్తనమే కనిపిస్తుందని పార్టీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అన్నింటా తలసాని హడావుడే ఉంటుందని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు – నాయకులు లోలోపల ఉడికిపోతున్నట్లు తెలుస్తోంది. కొద్దికాలంగా చూస్తే.. పార్టీ సభ్యత్వాలు – బోనాలు – డబుల్ బెడ్ రూం ఇళ్లు – ఇతర అధికారిక కార్యక్రమాలన్నింటా మంత్రి హడావుడినే ఎక్కువగా ఉంటుందని – స్థానిక ఎమ్మెల్యేలకు – నాయకులకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని – ఇలాంటప్పుడు తాము ఉండి ఎందుకని పలువురు ఎమ్మెల్యేలు – నాయకులు గుసగుసలాడుకుంటున్నారట.

ప్రధానంగా మంత్రి తలసాని తీరుతో అటు నాయకులు – ఇటు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారట. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తలసాని కుమారుడు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే.. మొదటి నుంచి తలసాని తీరుతో అసంతృప్తిగా ఉన్న నేతలు – ఎమ్మెల్యేలు ఎన్నికల్లో సహకరించలేదనే టాక్ ఉంది. ఇక అప్పటి నుంచి మంత్రి తలసాని మరింత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతా నా ఇష్టం అన్నట్టుగా మంత్రి ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మంత్రి తలసాని ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్నగర్ నియోజకవర్గంలోనూ కుమారుడికి ఆధిక్యం రాకపోవడం గమనార్హం.

అంతేగాకుండా.. ఇటీవల పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదులో గ్రేటర్ లో పెద్దగా మెంబర్ షిప్ నమోదు కాకపోవడం గమనార్హం. దీనిపై పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా… మంత్రి తలసాని తీరుతో గ్రేటర్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని – ఆయన దూకుడుకు కళ్లెం వేయకుంటే.. మరింత నష్టం జరగడం ఖాయమని పలువురు నాయకులు ఇప్పటికే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. చూద్దాం మరి… ముందుముందు ఏం జరుగుతుందో..!
Please Read Disclaimer