దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు.. చంద్రబాబు రివర్స్ పంచ్ పేలిందిగా!

0

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుట్విటర్ వేదికగా పంచ్ విసిరారు. జగన్ పదే పదే చెబుతున్న ‘దేవుడి స్క్రిప్ట్’ మాటలను ఉపయోగించి వైఎస్సార్‌సీపీ సర్కార్‌పై సెటైర్ వేశారు. నవ్యాంధ్ర నయా రాజధాని అమరావతిని గ్రాఫిక్స్ అని, భ్రమరావతి అని ఎవరైతే అబద్ధాలు చెప్పారో, వాళ్ల చేతనే దేవుడు ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించాడని.. దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

గత ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో టీడీపీ 23 మంది ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. అయితే.. చంద్రబాబు నేతృత్వంలోని గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీడీపీలోకి ఫిరాయించారు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్.. టీడీపీ అధినేత తీరును తప్పుబడుతూ ధ్వజమెత్తారు.

ఆ స్క్రిప్ట్ నేపథ్యం ఇదే..
‘దేవుడి స్క్రిప్ట్ గొప్పగా ఉంటుంది. మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుంటే.. ఇవాళ మీరు 23కే పరిమితం అయ్యారు. ముగ్గురు ఎంపీలను లాక్కుంటూ 3 ఎంపీ స్థానాలకే పరిమితమయ్యారు. ఇంతకంటే గొప్ప స్క్రిప్టు, తీర్పు ఇంకేం ఉంటుంది’ అని జగన్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోనూ, పలు బహిరంగ సభల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జాతీయ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగానూ ఈ విషయం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిచర్యగా చంద్రబాబు తాజా వ్యాఖ్యలు చేశారు.


‘దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు.. ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు’ అని టీడీపీ నేత ట్వీట్ చేశారు. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించింది. దీంతో వైఎస్ జగన్ సర్కార్‌పై ఎదురుదాడికి దిగడానికి చంద్రబాబుకు మంచి అవకాశం చిక్కనట్టైంది. సదరు ఫొటోలను ట్వీట్ చేస్తూ అధికార పార్టీపై టీడీపీ అధినేత కౌంటర్ అటాక్ చేశారు. 

వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనం చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయంలో నిర్మితమైన విషయం తెలిసిందే. దీనితో పాటు అసెంబ్లీ, హైకోర్టు భవనాలు కూడా ఆయన ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటయ్యాయి. అయితే.. ఇవన్నీ తాత్కాలికమైనవే కావడం గమనార్హం. 
Please Read Disclaimer