రాజధానిని మార్చడానికే ఆ కుట్రలు.. రైతుల పంటను వరదలో ముంచారు: చంద్రబాబు

0

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయని.. రాజధాని అమరావతిని మార్చడానికి కుట్రలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కుట్ర పూరితంగానే ఉండవల్లిలో తన నివాసాన్ని నీటిలో మునిగేలా చేశారని.. రైతుల పంటలను వరద నీటిలో ముంచారని చంద్రబాబు ఆరోపించారు. వరదలకు తన నివాసం మునిగే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన లేకుండా వ్యవహరించి ప్రజలను నీట ముంచిందని మండిపడ్డారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వరద ముంపు బాధితులను మంగళవారం (ఆగస్టు 20) సాయంత్ర ఆయన పరామర్శించారు.

నవ్యాంధ్ర నయా రాజధాని అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించి కావాలనే రాజధాని నిర్మాణాన్ని నిలిపి వేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రైతులు ఏం పాపం చేశారని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని.. వీటిలో మౌలిక వసతుల కోసం భూమిని కేటాయించిన తర్వాత ఇంకా 8 వేల ఎకరాల వరకు మిగులుతుందని చెప్పారు. ఆ భూమి అమ్మినా ఖర్చు లేకుండా రాజధానిని నిర్మించుకోవచ్చని వివరించారు.

‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణాలు నిలిచిపోయాయి. రాజధానిని మార్చాలనే కుట్రతోనే ముంపు ప్రాంతం అంటూ దుష్ప్రచారం మొదలు పెట్టారు. అమరావతిపై మంత్రి బొత్స దారుణంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు తన నివాసం మునిగే అవకాశం లేకపోతే హైదరాబాద్‌కు ఎందుకు పారిపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ కుయుక్తులపై ఎంతవరకైనా వెళ్తామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పట్టిసీమతో అవనిగడ్డ ప్రాంతంలో వాణిజ్య పంటలకు నీరిచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.

‘ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు తప్ప ప్రజల భద్రత పట్టలేదు. ఏం పాపం చేశారని రైతుల పంటలను వరదలో మునిగేలా చేశారు? ఆలోచన లేకుండా వ్యవహరించి ప్రజలను నీట ముంచారు. ప్రతీ బాధిత కుటుంబానికి వెంటనే పూర్తి స్థాయి వరద సహాయాన్ని ప్రభుత్వం అందజేయాలి’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

కేశినేని నాని సెటైరికల్ ట్వీట్
సీఎం గారు రైతులను ఆదుకోండి అంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. వేల ఎకరాలు నీట మునిగి రైతులు ఆర్థికంగా చితికి పోయారని ఆయన పేర్కొన్నారు. రివర్స్ వెళ్లకుండా ఆదుకోవాలని ఆయన సెటైర్ వేశారు.

‘సీఎం @ysjagan గారు.. వేల ఎకరాలు నీట మునిగి రైతాంగం ఆర్థికంగా చితికి పోయింది. ఇటుక ఇటుక పేర్చుకుని కట్టుకున్న ఇళ్లు మునిగి పోయి పేద ప్రజలు రోడ్డున పడ్డారు కొంచం “రివర్సు” వెళ్లకుండా వారందరినీ ఆదుకోండి సారు మీకు పుణ్యముంటుంది’ అని కేశినేని ట్వీట్ చేశారు.
Please Read Disclaimer