జగన్ నువ్వు మగాడివైతే రా.. ‘అనంతపురం’ టీడీపీ ఎమ్మెల్యే సవాల్

0

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు. నాలుగెకరాలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నానని అనుకుంటున్నావా జగన్‌మోహన్‌ రెడ్డి? అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రాకముందు నీ కుటుంబ ఆస్తులేంటి? నా కుటుంబ ఆస్తులేంటో ఒకసారి తెలుసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1950లోనే మూడు ట్రాక్టర్లను ఇంపోర్ట్ చేసుకుని వ్యవసాయం చేసిన కుటుంబం మాది అని కేశవ్ అన్నారు.

వ్యవసాయంపై మమకారం అలా ఉండేదని.. తమ వ్యవసాయం చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేవారని కేశవ్ అన్నారు. అనంతపురంలో స్థిరపడిన వ్యక్తితో జగన్ తాత రాజారెడ్డి కూడా తమ వ్యవసాయం చూసేందుకు వచ్చారన్నారు. తమ కుటుంబం వేల ఎకరాల నుంచి ఎక్కడికి వచ్చిందో అనంతపురం జిల్లాలో అందరికీ తెలుసన్నారు. అదే సమయంలో నీ ఆస్తులు ఎలా పెరిగాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని కేశవ్ విమర్శలు గుప్పించారు.

నీ ఆస్తులు ఎలా పెరిగాయో? నా ఆస్తులెలా తగ్గాయో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలన్న కేశవ్.. ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డున విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అంతటితో ఆగని కేశవ్.. నిజంగా నువ్వు మగాడివైతే.. రాయలసీమ రక్తం ఉంటే.. మూడు తరాల నీ ఆస్తులపైన.. మూడు తరాల నా ఆస్తుల పైన బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని చాలెంజ్ చేశారు.

తాడేపల్లిలో జగన్ కట్టుకున్న ఇల్లు ఆయన పేరిట లేదని.. కంపెనీల పేరుమీద ఉందన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్ నివాసం, బెంగళూరు ప్యాలెస్ ఏవీ జగన్ పేరుపై లేవని.. బినామీల పేర్లపై ఉన్నాయని కేశవ్ ఆరోపించారు. జగన్ తిరిగే వాహనాలు కూడా బినామీ పేర్లపైనే ఉన్నాయన్న టీడీపీ ఎమ్మెల్యే .. ‘నీ బతుకే ఓ బినామీ.. నువ్వు నాకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నావా?’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Please Read Disclaimer