పోతూ..పోతూ..వైసీపీకి వరమిచ్చిన టీడీపీ నేత

0

అదేంటి!? అనుకుంటున్నారా? అవును! రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సో.. ఎప్పుడు ఏం జరిగినా.. ఆసక్తిగా చర్చించుకోవడమే! ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. కత్తులు నూరుకుం టున్న వైసీపీ – టీడీపీల రాజకీయం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు నిప్పులు కురిపించుకుంటున్నారు. అటు అసెంబ్లీ కావొచ్చు.. ఇటు.. బయట మీడియా ముఖంగా కావొచ్చు.. ఏదైనా.. సరే వైసీపీ అంటే.. టీడీపీ – టీడీపీ అంటే వైసీపీలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో టీడీపీకి చెందిన కీలక నాయకుడు ఒకరు వైసీపీకి మేలు చేశాడు.

సదరు టీడీపీ సీనియర్ నాయకుడు.. శాసన మండలిలో వైసీపీకి మరో సభ్యుడిని పెంచారు. కొంచెం చిత్రంగానే అనిపించినా.. ఇది నిజం. విషయంలోకి వెళ్తే.. టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్ మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో శాసనమండలి ఇన్ చార్జ్ కార్యదర్శి సత్యనారాయణకు తన రాజీనామా లేఖను అందజేశారు. అదే సమయంలో ఆయన… టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వార్డు మెంబర్ గా గెలవలేని వాళ్లకు పదవులు కట్టబెట్టారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. వ్యాపారవేత్తలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు.

లోకేశ్ కు మంత్రి పదవికి అర్హత ఆయన సీఎం కొడుకు కావడమేనన్నారు. పార్టీ నిర్ణయాల్లో చంద్రబాబు పాత్ర లేదనిపిస్తోందన్నారు. ఇక అన్నం వ్యాఖ్యలు నేటి రాజకీయాల్లో సహజమే. పార్టీలో ఉన్నన్నాళ్లూ.. అధినేతను మోసిన వారు.. తర్వాత కాడి కింద పడేయడం మామూలే. అయితే అన్నం పోతూ పోతూ.. టీడీపీపై రాళ్లు విసిరిన ఆయన అదేసమయంలో వైసీపీకి వరం అందించారు. అదే.. ఎమ్మెల్సీ స్థానం. అన్నం రాజీనామా చేసిన స్థానం ఇక టీడీపీకి దక్కదు. సంఖ్యా పరంగా చూసుకున్నా.. వైసీపీ ఇప్పుడు మండలిలో తక్కువగానే ఉంది.

అయితే ఇప్పుడు ఈ సంఖ్యను పెంచుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. రాబోయే రోజుల్లో మండలికి ఎన్నికలు జరిగినప్పుడు అధిక మెజారిటీ తరఫున వైసీపీ ఈస్థానం గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల ముందు టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇది కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్లనుంది. సోమిరెడ్డి ఒక్కరే కాదు నారాయణ – కరణం బలరాం రిజైన్ చేసిన ఎమ్మెల్సీలు అన్ని వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయ్. ఇప్పుడు మరో సీటు వైసీపీ సొంతం చేసుకోనుంది. మొత్తానికి పోతూ పోతూ.. టీడీపీ నాయకుడు వైసీపీకి మేలు చేశారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Please Read Disclaimer