ఆపరేషన్ కమలం.. టీడీపీకి మరో షాక్, బీజేపీ గూటికి నాసా సైంటిస్ట్!

0

ఆపరేషన్ కమలం ధాటికి టీడీపీలో ఒక్కో వికెట్ పడిపోతోంది. తాజాగా ఆ పార్టీ నేత గుంటూరు జిల్లాకు చెందిన చందు సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాషాయం కండువా కప్పుకోనున్నారు. సౌమ్యుడిగా, బాబుకు విధేయుడిగా పేరున్న సాంబశివరావు టీడీపీకి రాజీనామా చేయడం పార్టీ నేతలకు షాకిచ్చింది. అమెరికాలో నాసా సైంటిస్టుగా పనిచేస్తున్న సమయంలో ఆయనకు నారా లోకేష్ పరిచయమయ్యారు. ఆ తర్వాత 2004 లో తటస్థులకు టికెట్లిస్తున్నామని ప్రకటించిన టీడీపీ.. సాంబశివరావును గుంటూరు జిల్లా దుగ్గిరాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించింది. ఆ ఎన్నికల్లో చందు సాంబశివరావు ఓటమిపాలయ్యారు.

తర్వాత టీడీపీ తరఫున వివిధ టీవీ ఛానెళ్లలో టీవీ డిబేట్లలో పాల్గొన్న సాంబశివరావు పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించేవారు. తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చాలాసార్లు ప్రచారం జరిగింది. కానీ ఆయనకు మాత్రం అవకాశం దక్కలేదు. చివరకు చంద్రబాబు ఆయనకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) డైరెక్టర్ పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా టీడీపీ ఇంఛార్జిగా ఉన్నారు. తాజాగా 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత ఆయన బీజేపీలోకి చేరాలని నిర్ణయించుకున్నారు.

కాపు సామాజిక వర్గానికి చెందిన సాంబశివరావు టీడీపీలో చేరిన నాటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్నారు. 2009లో చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు, 2014లో జనసేన పెట్టినప్పుడు కూడా పార్టీ మారకుండా చంద్రబాబు వెన్నంటే ఉన్నారు. అమెరికాలో పిల్లలను, నాసా సైంటిస్ట్‌గా కెరీర్‌ను వదులుకొని వచ్చిన ఆయనకు టీడీపీలో రాజకీయంగా కలిసి రాలేదు. ఎన్నికల ముందే ఆయన్ను రెరా ముగ్గురు డైరెక్టర్లలో ఒకరిగా బాబు నియమించారు. దీంతో టీడీపీలో ఉంటే భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చిన బీజేపీలో చేరాలని నిర్ణయించకున్నారని సమాచారం.
Please Read Disclaimer