టీడీపీలో నేను నమ్మింది ఆయన్నే.. జగన్‌తో పాతికేళ్ల అనుబంధం: వల్లభనేని వంశీ

0

త్వరలోనే వైఎస్ఆర్సీపీలో చేరతానని ప్రకటించిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పొత్తులతో నెట్టుకొస్తుంది. కానీ 2029 నాటికి పార్టీ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఉన్నంత వరకే టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసే స్థితిలో ఉంటుందన్నారు. ఎన్టీఆర్ హయాంలో 35 లోక్ సభ సీట్లు, 262 అసెంబ్లీ స్థానాలు గెలిచి.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన టీడీపీ.. ప్రస్తుతం ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయిందన్నారు.

టీడీపీలో తాను నమ్మింది సుజనా చౌదరి ఒక్కరినేనన్న వల్లభనేని వంశీ.. ఇప్పుడు జగన్‌ను నమ్ముతున్నానన్నారు. సుజనా చౌదరి బీజేపీలో చేరిన తర్వాత టీడీపీతో మెంటల్ కనెక్టివిటీ తెగిపోయిందన్న వంశీ.. అందుకే తాను వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడే తనపై కేసులు మోపారన్నారు. చంద్రబాబుతో టీడీపీ నేతలెవరికీ మెంటల్ కనెక్టివిటీ లేదన్నారు.

జగన్‌‌తో తనకుంది ఏడేళ్ల పరిచయం మాత్రమే కాదన్న వంశీ.. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు 1995 నుంచే తనకు జగన్‌తో పరిచయం ఉందన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా టీడీపీని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. దేవినేని ఉమా వేస్ట్ ఫేలో.. ఆయన టీడీపీని బతకనివ్వరు. కానీ చంద్రబాబుకు ఆయన సలహాలే నచ్చుతాయన్నారు.

రాష్ట్రంలో అత్యంత పెద్ద కుటుంబానికి చెందిన ఒక స్త్రీకి 10 వేలకుపైగా ఈ-మెయిల్స్ పెట్టారు. తర్వాత తప్పయ్యిందని వెళ్లి కాళ్ల మీద పడ్డారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఎలా ప్రయత్నించారో ఇదో ఉదాహరణ అని టీడీపీ నేతలపై వంశీ సంచలన ఆరోపణలు చేశారు.
Please Read Disclaimer