ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ వరాల జల్లు.. అధికారులకు కీలక ఆదేశాలు!

0

ప్రగతి భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో భేటీ అయిన సీఎం కేసీఆర్ వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం ఆర్టీసీ కార్మికులతో మాట్లాడిన ఆయన.. వారిపై వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతం.. డిసెంబర్ 2న ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమ్మె చేసిన 55 రోజుల పూర్తి జీతం కూడా ఆర్టీసీ కార్మికులకు ఇప్పిస్తానని సీఎం కేసీఆర్ మాటిచ్చారు. సమ్మె కాలం నాటి మీ జీతం బ్యాంకులో ఉందనుకోండని కార్మికులకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఇంక్రిమెంట్లు కూడా తీసేయొద్దని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

‘ఆర్టీసీ కార్మికుల్లో కొందరు సీనియర్లకే రూ.50 వేల జీతం వస్తోంది. చాలా మంది తక్కువ జీతానికే పని చేస్తున్నార’ని సీఎం చెప్పారు. ‘‘కేసీఆర్‌తో మాట్లాడి మీరేం తెచ్చారని కొందరు ప్రశ్నిస్తారు.. కాలర్ ఎగరేసి చెప్పండి.. కార్మిక సంఘాల నేతలు ఉన్నది ఊడగొడితే.. మేం వెళ్లి సెప్టెంబర్ నెల జీతం తెచ్చుకున్నామని చెప్పండి’’ అని కార్మికులను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు.

సమ్మె కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబీకులకు 8 రోజుల్లోగా వారి అర్హతల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కార్మికుల ఉద్యోగాలు ఎక్కడికీ పోవన్న సీఎం.. డ్రైవర్లకు వర్ణాంధత్వం వచ్చినా ఉద్యోగాల నుంచి తీసేయమని హామీ ఇచ్చారు.

ఆర్టీసీ భవిష్యత్తు కార్మికుల చేతుల్లోనే ఉందన్న సీఎం.. కష్టపడి పని చేసి సంస్థను లాభాల్లో తీసుకెళ్తే.. సింగరేణి తరహాలో ఏటా బోనస్ ఇస్తామని ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే అధిక వేతనం వస్తోందన్న సీఎం.. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలోనూ ఇది వంద శాతం జరుగుతుందన్నారు. తెలంగాణ సాధించగా లేనిది.. ఆర్టీసీని లాభాల బాట పట్టించడం సాధ్యం కాదా? అని ప్రశ్నించారు.

ఇవాళ వచ్చిన కార్మికులందరితో.. నాలుగు నెలల తర్వాత మళ్లీ కలుస్తానని సీఎం తెలిపారు. ఈ నాలుగు నెలలు అహర్నిశలు శ్రమిద్దామన్నారు. సంస్థ మనుగడ కోసం కార్మికులు సహకరించాలని కోరిన కేసీఆర్.. ఉద్యోగ భద్రత విషయంలో వారికి హామీ ఇచ్చారు. అందరి కంటే ముందు ఆర్టీసీ అధికారులు మారాలని సీఎం తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు అందరూ సమానమే అన్న సీఎం.. యాజమాన్యం, కార్మికులు అనే విభజన రేఖ తొలగిపోవాలన్నారు. అందరిదీ ఒకటే కుటుంబమన్నారు.

వచ్చే ఏడాది నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలను గ్రాంట్‌గా పెడతామన్నారు. 5000 రూట్లు కాదు కదా.. ఒక్క రూట్ల‌ోనూ ప్రయివేట్ బస్సులను అనుమతించమన్నారు. చైల్డ్ కేర్ లీవుల పెంపు సహా.. మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్న సీఎం.. డిపోల్లో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తామన్నారు. మహిళా కండక్టర్లు, ఉద్యోగులు రాత్రి 8 గంటల్లోగా డ్యూటీ దిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు ఇష్టమైన రంగులోనే కొత్త యూనిఫాంను రూపొందించుకోవచ్చన్నారు. రెండేళ్లపాటు డిపోల్లో యూనియన్లు లేకుండా పని చేద్దామని సీఎం పిలుపునిచ్చారు. ఇది ఫలితం ఇవ్వకపోతే తిరిగి యూనియన్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఆర్టీసీ పార్శిల్ సర్వీసులను ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కష్టపడి పని చేస్తే.. ఏడాదిలోగా వెయ్యి కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్టీసీ ఆర్జిస్తుందన్న కేసీఆర్.. కార్మికులకు లక్ష రూపాయల బోనస్ వేస్తామన్నారు. తాను కోరుకునేది ఇదేనని ముఖ్యమంత్రి తెలిపారు. పాత ఆర్టీసీ వద్దు.. కొత్త ఉద్వేగంతో ముందుకెళ్దామని కార్మికులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రేపటి నుంచి కార్మికులు అని పిలవొద్దు, ఉద్యోగులు అనే పిలవాలన్నారు.

ఈ సందర్భంగా శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్య విషయమై స్పందించారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని, శంషాబాద్ ఘటన దారుణం అమానుషం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బాధితురాలి కుటుంబానికి తాము అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు.
Please Read Disclaimer