కేసీఆర్ సంచలనం… ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోరట!

0

తెలంగాణ ఆర్టీసీ సమ్మెను ముగిస్తున్నట్లు ఎట్టకేలకు కార్మిక సంఘాల నేతలు ప్రకటించేశారు. అంతేకాకుండా మంగళవారం నుంచి విధుల్లోకి వస్తామని కూడా ప్రటించేశారు. దీంతో 50 రోజులకు పైగా కొనసాగిన సమ్మె ముగిసిందిలే అంటూ అంతా ఊపిరి తీసుకుంటున్న వేళ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాంబులాంటి వార్తను పేల్చారు. తమ మాట వినకుండా విధులకు రోజుల తరబడి డుమ్మా కొట్టిన ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకునేది లేదని కేసీఆర్ సర్కారు తెగేసి చెప్పేసింది. అంతేకాకుండా విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కార్మికులను విధుల్లోకి ఎలా తీసుకుంటామని కూడా కేసీఆర్ సర్కారు ఓ సంచలన ప్రకటనను కూడా విడుదల చేసింది. కేసీఆర్ సర్కారు నుంచి వెలువడిన ఈ ప్రకటన ఆర్టీసీ కార్మికులకు నిజంగానే బిగ్ షాకేనని చెప్పక తప్పదు.

ఏపీలో మాదిరిగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ టీఎస్సార్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే కార్మికుల సమ్మెకు తమ అనుమతి లేదని తక్షణమే కార్మికులంతా విధుల్లో చేరాలని కూడా కేసీఆర్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. విధులకు హాజరుకాని కార్మికులు సంస్థ నుంచి తొలగించబడినట్టేనని కూడా సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ హెచ్చరికలను బేఖాతరు చేసిన కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెను కొనసాగించారు. హైకోర్టు కూడా కేసీఆర్ సర్కారుకు అనుకూలంగానే వ్యాఖ్యలు చేయడంతో కార్మికులు ఓ మెట్టు దిగారు. తమను భేషరతుగా విధుల్లో చేర్చుకుంటే సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. అయితే దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం సమ్మెను విరమిస్తున్నట్లుగా కార్మికులు ప్రకటించారు.

సమ్మె ముగిసిన నేపథ్యంలో కేసీఆర్ ఆర్టీసీ రవాణా శాఖ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో సమ్మెను విరమించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలా? వద్దా అన్న అంశంపై మీదే చర్చ నడిచినట్టుగా సమాచారం. ఈ భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ… సంచలన కామెంట్లు చేశారు. సమ్మె విరమించిన కార్మికులను విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా ఎప్పుడుపడితే అప్పుడు విధుల్లోకి చేరతామంటున్న కార్మికులను ఎలా చేర్చుకునేది అంటూ మరో కామెంట్ చేశారు. అంతేకాకుండా సమ్మె విరమిస్తున్నట్లుగా కార్మిక సంఘాలు అందజేసిన లేఖను కూడా ఆయన తీసుకోలేదు. ప్రస్తుతం కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలా? వద్దా? అన్న అంశం లేబర్ కోర్టులో ఉందని… దాని తీర్పు ఆధారంగానే నడుచుకుంటామని కూడా ఆయన మరో బాంబు లాంటి వార్తను వినిపించారు. మొత్తంగా సమ్మె విరమించిన కార్మికుల భవిష్యత్తు గాల్లో దీపంలా మారిందన్న వాదన వినిపిస్తోంది.
Please Read Disclaimer