వణుకు తెప్పిస్తున్న కొత్తగూడెం..షాకింగ్ విషయం ఏమంటే?

0

ఒకరి నిర్లక్ష్యం ఎంతటి ముప్పును తెచ్చి పెడుతుందో కొత్తగూడెం ఎపిసోడ్ స్పష్టం చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన డీఎస్పీ ఒకరు విదేశాల నుంచి వచ్చిన తన కొడుకును రహస్యంగా దాచి పెట్టిన వ్యవహారం ఒక ఎత్తు అయితే.. అతగాడికి కరోనా పాజిటివ్ కావటం మరో ఎత్తు. తాజాగా ఈ ఎపిసోడ్ లో షాకింగ్ న్యూస్ ఏమంటే.. సదరు డీఎస్పీతో పాటు.. ఆ ఇంట్లో పని చేసే వంట మనిషికి కూడా కరోనా పాజిటివ్ కావటం ఉలిక్కిపడేలా చేస్తోంది.

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలటం ఇప్పటివరకూ పలు ఉదంతాల్లో చూస్తున్నా… సదరు వ్యక్తి కారణంగా అతనికి ప్రైమరీ కాంటాక్టు అయిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలటం ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. కరోనాను వీలైనంతవరకూ మొదటి స్టేజ్ లోనే నిలిపివేయాల్సిన అవసరం ఉంది. అది సాధ్యంకాని వేళ.. రెండో స్టేజ్ లోకి అడుగు పెట్టినంతనే.. కఠిన నిర్ణయాలతో అక్కడితో కథ ముగిసేలా చేయాలి.

ఆ విషయంలో జరిగే తప్పులకు ప్రజలంతా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు దేశాల్లో చోటు చేసుకున్న ఉదంతాల్ని చూసినప్పుడు ఈ విషయం అర్థమవుతుంది. మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత (పదకొండు గంటల సమయంలో) విడుదల చేసిన బులిటెన్ లో లండన్ నుంచి వచ్చిన కొత్తగూడెం కుర్రాడికి తండ్రికి కూడా పాజిటివ్ గా తేలింది. మరింత ఆందోళన కలిగించే అంశం.. సదరు కుర్రాడితో కాంటాక్టు అయిన మరో పెద్ద వయస్కురాలుకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్లు పేర్కొన్నారు. దీంతో.. తెలంగాణలో కరోనా కేసులు 39కు చేరుకున్నాయి.

తాజాగా పాజిటివ్ గా ప్రభుత్వం ప్రకటించిన రెండు కేసులు కొత్తగూడెం జిల్లాకు చెందినవి కావటంతో అధికారులంతా అప్రమత్తంగా కావటమే కాదు.. డీఎస్పీ కుటుంబం నివసించే ఇంటి పరిధిలోని మూడు కిలోమీటర్ల మేర ఉన్న వారందరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ చేశారు. మరో ఏడు కిలోమీటర్లను బఫర్ జోన్ గా గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. లండన్ నుంచి వచ్చిన సదరు డీఎస్పీ కుమారుడ్ని పలుకరించేందుకు వచ్చిన స్నేహితులు.. బంధువులు.. ఆప్తులు తాజా సమాచారంతో కొత్త భయం పట్టుకుంది. తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో వారున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని కలిసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం నెత్తి నోరు కొట్టుకున్నా వినకుండా వ్యవహరించే వారికి ఇలాంటి ఆందోళనలు తప్పవు. ఇదిలా ఉంటే..డీఎస్పీకి కరోనా పాజిటివ్ అని తేలటంతో.. పోలీసుశాఖకు చెందిన వారు ఆందోళనకు గురి అవుతున్నారు. సారుకు.. దగ్గరగా ఉన్న వారి సంగతి మరింత ఇబ్బందికరంగా మారింది.మొత్తంగా కొత్తగూడెంలో కరోనా భయం వణుకు తెప్పించేలా మారిందని చెప్పక తప్పదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-