పీవీ లాంటోడు మనకొకడు మళ్లీ కావాలి

0

బ్యాక్ గ్రౌండ్ లేనోడికి సినిమాల్లోనే ఛాన్సులు రావు. అలాంటిది రాజకీయాల్లో రావటం చాలా కష్టం. అందునా దేశ ప్రధాని లాంటి పదవిని చేపట్టే ఛాన్సు వస్తుందా? ఉత్తరాది లాబీని కాదని.. దక్షిణాదికి చెందిన ఒక తెలుగోడికి పీఎం కుర్చీని కట్టబెట్టే పెద్ద మనసు ఈ దేశ రాజకీయాలకు ఉందని ఎవరూ చెప్పరు. కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబం మాత్రమే గుర్తుకు వచ్చే దానికి బదులుగా.. పీవీ లాంటోడు ఒకడు ఉంటాన్న విషయాన్ని దేశానికి చాటి చెప్పే ప్రత్యేకత.. విలక్షణత మరే నేతలోనూ కనిపించదు.

పీవీ నరసింహరావు అలియాస్ పాములపర్తి వేంకట నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. కారణం ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని.. ఇప్పుడంతా పీవీ గురించి మాట్లాడుతున్నారు. ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. శత జయంతి ఉత్సవాల్ని ధూంధాంగా నిర్వహించాలని డిసైడ్ చేయటం.. భారీ ప్రణాళికను సీఎం కేసీఆర్ ప్రకటించటంతో.. మీడియా సైతం అలెర్టు అయ్యింది. రాష్ట్ర సర్కారు అంత ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత.. మీడియాకు బాధ్యత ఉంటుంది కదా? అన్న ధోరణిలో పేజీలు తక్కువైనప్పటికీ ఒక పేజీని పీవీకి కేటాయించటం ద్వారా ఇప్పటి తరానికి ఆయన గురించి తెలిసేలా చేశారు.

1200 ఎకరాల అసామి కొడుకు సాధారణంగా ఎలా ఉంటాడు. అందునా దొరతనానికి కేరాఫ్ అడ్రస్ లా నిలిచే తెలంగాణలో పుడితే.. ఆ లెక్కే వేరుగా ఉంటుంది. కానీ.. అలాంటివేమీ వంట పట్టించుకోకపోవటం పీవీ ప్రత్యేకత. సంపన్న కుటుంబంలో పుట్టి కూడా మధ్యతరగతి జీవిగా బతకటం ఆయనకు ఎక్కువ ఇష్టం. అంతేనా.. చిన్నతనంలోనే నిజాం నిరంకుశత్వానికి తల ఎగరేయటమే కాదు.. వందేమాతరం పాడితే స్కూల్ నుంచి డిస్మిస్ చేయటాన్ని లెక్క చేయకుండా పాడి.. డిస్మిస్ అయ్యారు. హన్మకొండ కాలేజీలో వందేమాతరం పాడినందుకు ఆయన్ను కాలేజీ నుంచి తొలగించారు. తర్వాత ఫూణె.. నాగపూర్ లో ఉన్నత విద్యను అభ్యసించారు.

సంపద ఉన్నా దాని పట్ల వ్యామోహాన్ని ప్రదర్శించని వారు అక్కడక్కడా కనిపిస్తారు. కానీ.. ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి.. తనకున్న 1200 ఎకరాల భూమిలో పరిమితికి మించి ఉన్న భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పే వారు ఉంటారా? అన్నప్పుడే పీవీ గొప్పతనం కనిపిస్తుంది. ఆస్తి ఉన్నా.. తాను చేసే ఉద్యోగంతో వచ్చే డబ్బులతోనే నెలంతా గడిపే తీరు ఇప్పటివారికి ఏ మాత్రం అర్థం కాకపోవచ్చు.

క్రమపద్దతిలో..దశల వారీగా ఎదిగిన పీవీ.. భారత రాజకీయాల్లో తన ముద్రను స్పష్టంగా వేశారని చెప్పాలి. ఇవాల్టి రోజున దేశ ఆర్థిక పరిస్థితి ఇలా ఉందంటే.. ఆయన పెట్టిన భిక్షే. తాను ప్రధానమంత్రి అయ్యాక సంస్కరణల రథాన్ని పరుగులు తీయించటం మొదలెట్టారు. అప్పట్లో మీడియాలోనూ.. పలు రాష్ట్రాల్లోనూ పట్టు ఉన్న కమ్యునిస్టులు.. పీవీకి వ్యతిరేకంగా చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ వారు సాగించిన ప్రచారానికి వేరే వారైతే హడలిపోయి ఆగమాగమయ్యేవారేమో. కానీ.. పీవీ శాంతచిత్తుడు. అనవసరమైన ఆవేశాన్ని ఎప్పుడూ ప్రదర్శించరు. మౌనంగా ఉండటమే కాదు.. వ్యూహాత్మక ఎత్తులు వేయటంలో ఆయనకు ఆయనే సాటి.

ఇప్పటి రాజకీయాల్లో నేతలుపలువురు తరచూ వాడే ఒక మాట ఉంది చూశారు.. ‘‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది’’ ఆ మాట పేటెంట్ పీవీదే. తొమ్మిది భారతీయ భాషల్లో.. ఆరు విదేశీ భాషల్లో అలవోకగా మాట్లాడే అతి అరుదైన నేతగా చెప్పాలి. విషయ పరిజ్ఞానం ఉండటం.. జ్ఞానాజ్ఞాన విచక్షణతో కూడిన ప్రవర్తన ఉండటంతో పీవీని బృహస్పతిగా అభివర్ణించేవారు. మితభాషి.. హాస్యప్రియత్వమే కాదు.. స్నేహానికి ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. తనకు సన్నిహితుడైన ప్రజాకవి కాళోజీ చేత ‘ఏరా’ అని అడిగి పిలిపించుకోవటం పీవీకే చెల్లుతుంది.. అది కూడా ఆయన దేశ ప్రధానిగా ఉన్న సమయంలో. ఇలాంటివి మరే నేతలోనైనా చూడగలమా?

ఇప్పటి రాజకీయాలు తెలుసు కదా.అధికారంలోకి వచ్చినంతనే రాజకీయ ప్రత్యర్థిని శత్రువులా చూసి.. వారి సంగతి చూసే వరకూ నిద్రపోని తీరు. అందుకు భిన్నం పీవీ. విధానాల పరంగా.. సిద్ధాంతాల పరంగా కుడి ఎడమలుగా ఉంటారు పీవీ.. వాజ్ పేయిలు. కానీ.. వారిద్దరూ ఎంతటి మిత్రులంటే.. దేశ అవసరాల కోసం విపక్ష నేతగా ఉన్న వాజ్ పేయిని భారత ప్రతినిధిగా పంపిన అరుదైన రాజకీయం పీవీ సొంతం. అలాంటి నేత రాబోయే రోజుల్లో వస్తారంటే అంతకు మించిన అతిశయోక్తి ఉండదు.

ఢిల్లీకి రాజైనా.. తెలుగు నేల మీద ఆయనకున్న అభిమానం అంతా ఇంతా కాదు. ఢిల్లీకి రాజే కావొచ్చు.. కానీ తెలుగు తల్లికి పిల్లాడ్నే అంటూ తెలుగు నేల మీద తనకున్న అభిమానాన్ని వినమ్రంగా విన్నవించుకునే వారు. అరకొర బలం ఉన్న మైనార్టీ ప్రభుత్వాన్ని.. ఎలాంటి రాజకీయ అండ లేని నేత.. అందునా ప్రజల్లో ఛరిష్మా లేని ఒకరు ప్రధాని పీఠం మీద ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడపటంలోనే పీవీ చతురత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. పీవీ ప్రధానమంత్రిగా వ్యవహరించిన సమయంలోనే గల్ఫ్ యుద్ధం.. సోవియెట్ యూనియన్ పతనం లాంటి ప్రపంచాన్ని ప్రభావితం చేసే పరిణామాలు చోటు చేసుకున్నాయి.

అంతర్జాతీయంగానే కాదు.. దేశీయంగానే చాలా కీలక పరిణామాలే చోటుచేసుకున్నాయి. అలాంటి ఆటుపోట్లను తట్టుకొని.. కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి వేధింపుల్ని తట్టుకొని నిలవటం అంత తేలికైన వ్యవహారం కాదు. అది పీవీకి మాత్రమే సాధ్యం. ఇవాల్టి రోజున మన్మోహన్ సింగ్ అనే పెద్ద మనిషికి పదేళ్లు ప్రధానిగా అవకాశం వచ్చిందంటే.. దానికి కారణం.. ఆ రత్నాన్ని అందరి కంటే ముందే గుర్తించింది పీవీనే. దేశాన్ని ఆర్థికంగానే కాదు.. దౌత్యపరంగానూ బలోపేతం చేయటంలో ఆయన చేసిన కృషి ఎంతో.

అంతకు ముందున్న ప్రభుత్వాల పుణ్యమా అని దేశ ఆర్థిక పరిస్థితికి దివాళ దగ్గరకు వచ్చేసిన వేళ.. ఆర్థిక సంస్కరణలతో దేశ ముఖచిత్రాన్ని మార్చేయాలన్న అనూహ్య నిర్ణయ ఫలితమే నేటి భారత దేశం. ఒకవేళ.. ఆయన కానీ అప్పట్లో ఆ సాహసం చేసి ఉండకపోతే.. ఈ రోజున భారత ఇలా ఉండేది కాదు.

దేశాన్ని ఆధునిక ప్రపంచంతో అనుసంధానం చేసే ప్రక్రియను సమర్థంగా నిర్వహించిన ఆయనకు భారతావని ఎంత చేసినా రుణం తీరదంతే. అందుకేనేమో న్యూయార్క్ టైమ్స్ అప్పట్లో పీవీని ఎలా అభివర్ణించిందంటే.. ‘‘72 సంవత్సరాల పీవీ నరసింహారావు భారత దేశపు డెంగ్ జియావో పింగ్. జీవిత చరమాంకంలో ఉన్న ఒక నాయకుడు పాత ప్రభుత్వాలు నడిపిన ఆర్థిక పద్దతుల్ని పక్కన పెట్టారు. భారత్ లో బలంగా అల్లుకుపోయిన స్వార్థపరుల వలయాన్ని ఆయన ఛేదించే ప్రయత్నం చేశారు’’ అని పేర్కొంది.

సంస్కరణలకు ఓకే చెప్పే వేళలో.. ఐఎంఎఫ్ డైరెక్టర్ లో పీవీ చెప్పిందేమిటో తెలుసా?… ‘‘భారత ఆర్థిక వ్యవస్థకు ఏది మంచిదో అది చేయటానికి నేను అంగీకరిస్తాను. అయితే నా వల్ల ఒక్క కార్మికుడు కూడా ఉద్యోగం కోల్పోయానని చెప్పనంతవరకు మాత్రమే ఇదంతా’’ లాంటి మాటల్ని చెప్పే నేతలు ఇప్పుడు కనిపిస్తారంటారా? అందుకే.. దేశానికి మరో పీవీ అవసరం ఎంతైనా ఉంది. కానీ.. అలాంటోళ్లు మీకెక్కడైనా కనిపించారా?
Please Read Disclaimer