ప్రమోషన్ ఇవ్వకుంటే గుడ్ బై.. సీనియర్ ఐపీఎస్ సంచలనం

0

రాజకీయ రంగంలోనే కాదు.. ఐఏఎస్.. ఐపీఎస్ లలోనూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అధికారులు కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు సీనియర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్. జైళ్ల శాఖ డీజీగా ఉన్నవేళలో ఆయన నోటి నుంచి వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనకు అప్రాధాన్యత కలిగిన పోస్టుకు బదిలీ చేశారన్న ప్రచారం సాగుతుంటుంది. ఆ మధ్యన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ గా బదిలీ అయిన ఆయన.. ప్రభుత్వానికి ఈ మధ్య రాసినట్లుగా చెబుతున్న లేఖ సంచలనంగా మారింది.

తన సర్వీసుకు తగ్గ ప్రమోషన్ ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఉన్న ఆయన.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన ఒక లేఖ వివరాలు బయటకు వచ్చాయి. 1987 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన తాను 33 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. డీజీగా ఎంపానల్ అయ్యానని చెప్పారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ లు మూడేళ్ల క్రితం ప్రమోషన్ పొందారని.. 1989 బ్యాచ్ ఐఏఎస్ లకు ప్రమోషన్లు వచ్చాయని.. అదే బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ లకు ఏపీతో సహా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమోషన్లు వచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ తనకు ప్రమోషన్ రాకపోవటంపై ఆయన తన ఆగ్రహాన్ని లేఖ ద్వారా వెల్లడించారు. ప్రభుత్వం తమ పట్ల చూపుతున్న నిర్లక్ష్యం నేపథ్యంలో తాను పని చేయలేకపోతున్నట్లు చెప్పారు.

తాను ప్రమోషన్ కు పనికిరానని ప్రభుత్వం భావిస్తే.. ప్రస్తుతం తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొనటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ లేఖను తెలంగాణ రాష్ట్ర ముఖ్యకార్యదర్శికి.. ప్రభుత్వ ముఖ్య సలహాదారుకు పంపారు. ఈ లేఖ ముచ్చట ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు వెళ్లిందా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అర్హతలున్నా తనకు ప్రమోషన్ ఇవ్వని వైనంపై సీనియర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ రాసిన లేఖ ఇప్పుడు కలకలంగా మారింది. మరి.. ఇలాంటి లేఖపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Please Read Disclaimer