ఆర్టీసీ ఛార్జీల పెంపు.. ప్రజలు అర్థం చేసుకోవాలి: కేసీఆర్

0

ఆర్టీసీ సంస్థను పరిరక్షించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. తమది బాధ్యత గల ప్రభుత్వమని తెలిపారు. ఆర్టీసీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఛార్జీలు పెంచక తప్పడం లేదని వివరించారు. ఆర్టీసీ టికెట్ ఛార్జీలను కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంచుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీని పరిరక్షించే క్రమంలో ఈ నిర్ణయం తప్పడంలేదని.. ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

పెరిగిన ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. 100 కి.మీ. దూరానికి రూ.20 చొప్పున ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. ఆర్టీసీని ఆదుకోవడానికి తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కార్మికులు తమ బిడ్డలేనని.. వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే.. క్రమశిక్షణతో ఉద్యోగాలు చేసుకోవాలని సూచించారు.

ఆర్టీసీ సమస్యకు సీఎం కేసీఆర్ ముగింపు పలికారు. రాష్ట్రంలో 52 రోజులుగా సుదీర్ఘంగా సమ్మెలో పాల్గొని విధులకు దూరమైన 48 వేల మంది కార్మికులకు తిరిగి ఉద్యోగాల్లో చేరడానికి అవకాశం కల్పించారు. శుక్రవారం (నవంబర్ 29) ఉదయం నుంచే ఆనందంగా విధుల్లో చేరవచ్చని ప్రకటించారు. తాత్కాలికంగా విధులు నిర్వహించిన వారికి కూడా భవిష్యత్తులో లబ్ది చేకూర్చే నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గురువారం మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. కీలక వివరాలు వెల్లడించారు.

ఆర్టీసీ సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. బాధితు కుటుంబాల్లో ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. అర్హతలను బట్టి ఆర్టీసీలో లేదా, ప్రభుత్వంలో ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికుల ఆత్మహత్యలకు యూనియన్లే కారణమని కేసీఆర్ చెప్పారు. సమ్మె కాలంలో కార్మికులు తనను ఇష్టారీతిన దూషించారని.. కానీ, బాధ్యతమైన స్థానంలో ఉండి వాటన్నింటినీ పట్టించుకోనని వ్యాఖ్యానించారు. తమకు మానవత్వం ఉందని చెప్పారు.
Please Read Disclaimer