33 మంది మహిళలకు మత్తు ఇచ్చి వెళ్లి పోయిన డాక్టర్

0

విన్నంతనే ఉలిక్కి పడటమే కాదు.. ఇలాంటి అనుభవమే ఎదురైతే పరిస్థితి ఏమిటన్న ఆలోచనకే చెమటలు పట్టే ఈ ఉదంతం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. కుటుంబ నియంత్రణ కోసం వచ్చిన 33 మంది మహిళలకు శస్త్రచికిత్స చేసేందుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసిన వైద్యుడు.. అర్థాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయిన వైనం షాకింగ్ గా మారింది.

మధ్యప్రదేశ్ లోని టీకామ్ గఢ్ జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఈ దారుణానికి కారణమైంది. 33 మంది మహిళలకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత సిబ్బందితో తనకు గొడవ పడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన వైద్యుడు ఆపరేషన్ చేయకుండా వెళ్లిపోయారు. ఈ పరిణామానికి షాక్ తిన్న సిబ్బంది.. మరో వైద్యుడి కోసం కబురు చేశారు. గంట తర్వాత వచ్చిన వైద్యుడు వారికి ఆపరేషన్ చేశారు.

మత్తు ఇచ్చిన తర్వాత సర్జరీ చేయకుండా ఆపరేషన్ థియేటర్ లోనే ఉంచేసిన వైనంతో పేషంట్లు నరకయాతన పడ్డారు. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కాస్త ఆలస్యంగా అసలు విషయం తెలుసుకున్న రోగుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురై.. అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతంపై విచారణ సాగుతోంది.
Please Read Disclaimer