ఆకాశమే హద్దు… ముఖేశ్ తో పాటు రిలయన్స్ టాప్ లేపుతోంది

0

భారత పారిశ్రామిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్… తనతో పాటు తన యజమాని ముఖేశ్ అంబానీని కూడా ఆకాశమే హద్దుగా పయనించేలా చేస్తోంది. ఇప్పటికే తన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల స్థానంలో ఐదో స్థానానికి ఎగబాకగా… రిలయన్స్ రిఫైనరీస్ ఏకంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రిఫైనరీగా రికార్డులకెక్కింది. కరోనా నేపథ్యంలో ఓ వైపు అన్ని దేశాల్లోని పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు నానాటికీ కుంగిపోతుండగా.. అందుకు భిన్నంగా తనదైన వ్యూహాలను అమలు చేస్తున్న ముఖేశ్… తన సంపదను ఓ రేంజిలో పెంచుకుని ప్రపంచ కుబేరుల్లో ఒక్కసారిగా ఐదో స్థానానికి ఎగబాకగా… ముఖేశ్ అవలంబిస్తున్న నయా మంత్రంతో రిలయన్స్ లోని కీలక విభాగమైన రిఫైనరీ ఏకంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రిఫైనరీగా రికార్డులకు ఎక్కింది.

రిలయన్స్ టెలికాం విభాగం జియోలో దిగ్గజ సంస్థల పెట్టుబడులతో రిలయన్స్ అధినేత ఇప్పటికే ప్రపంచకు బేరుల జాబితాలోఇంతింటై వటుడింతై అన్నట్టుగా రోజుకో కొత్త శిఖరానికి ఎగబాకి ప్రస్తుతం ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా రిలయన్స్ కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కొత్త తీరాలకు చేరింది. రిలయన్స్ షేరు ధర ఇటీవల ఆల్‌టైం హైంకి చేరడంతో ఈ ఘనతను దక్కించుకుంది. రిఫైనరీ రంగంలో ఇప్పటిదాకా ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతున్న ఎక్సాన్ మొబిల్ కార్పొరేషన్‌ను అధిగమించిన రిలయన్స్ రిఫైనరీ… సౌదీ అరామ్కో తరువాత రెండో స్థానానికి ఎగబాకింది.

ఇప్పటికే అతిపెద్ద రిఫైనరీ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్ 8 బిలియన్ డాలర్లను కొత్తగా సాధించడంతో ఆ సంస్థ మార్కెట్ విలువ 189 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో కరోనా ఎఫెక్ట్ కారణంగా ఎక్సాన్ మొబిల్ 1 బిలియన్ డాలర్లను నష్టపోయింది. కరోనా వైరస్ లాక్డౌన్ సంక్షోభంతో ఇంధన డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా రిఫైనర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఎక్సాన్ షేర్లు 39 శాతం క్షీణించగా రిలయన్స్ షేర్లు ఈ ఏడాది 43 శాతం పుంజుకోవడం గమనార్హం. ఇక మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 1.76 ట్రిలియన్ డాలర్లతో అరాంకో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన సంస్థగా కొనసాగుతోంది.