అమెరికా కీలక నిర్ణయం … చైనాపై వీసా ఆంక్షలు !

0

అమెరికా చైనా మధ్య వైరం రోజురోజుకి ముదురుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఏడాదిన్నరకి పైగా సాగిన వాణిజ్య యుద్ధానికి జనవరిలో జరిగిన ఒప్పందంతో ఎండ్ కార్డు వేసినప్పటికీ ..కరోనా మహమ్మారి కారణంగా మళ్లీ అమెరికా చైనాల మధ్య వ్యవహారం బెడిసికొట్టింది. కరోనా పుట్టిన చైనాలో కంటే అమెరికాలోనే కరోనా వైరస్ ఎక్కువగా విజృంభిస్తుంది. అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో దీనికి ప్రధాన కారణం చైనానే అని అసలు అది కరోనా వైరస్ కాదు అని అది చైనా వైరస్ అంటూ చైనా పై అమెరికా విరుచుకుపడుతుంది.

తాజాగా టిబెట్ లో మానవహక్కుల ఉల్లంఘనలకు చైనా పాల్పడుతుందని ఆరోపణలు చేస్తూ చైనాకి చెందిన అధికారులపై అమెరికా వీసా ఆంక్షలు విధించింది. దీనితో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. టిబెట్ ప్రాంతంలో చైనా మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మంగళవారం వైట్ హౌస్ వేదికగా ఆరోపణలు చేసారు. ఈ సందర్భంగా చైనా అధికారులపై వీసా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. టిబెట్ లో విదేశీయులు పర్యటించకుండా అడ్డుకుంటున్న చైనా అధికారులపై వీసా ఆంక్షలు విధిస్తున్నాం.. ఆ దేశంలో మేము సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నాం అని పాంపియో తెలిపారు.

అమెరికా దౌత్యవేత్తలు ఇతర అధికారులు జర్నలిస్టులు పర్యాటకులను టిబెట్ అటానమస్ రీజియన్ ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకోవడానికి బీజింగ్ వ్యూహాత్మకంగా ముందుకుపోతుంది. అయితే చైనా అధికారులు పౌరులు అమెరికాలో ఎక్కువ ప్రాధాన్యత పొందుతున్నారని పాంపియో వెల్లడించారు. అయితే చైనా మాత్రం ఎప్పటిలానే తన వాదనను సమర్థించుకుంది. టిబెట్ ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని విదేశీయులు ఆ ప్రాంతంలో పర్యటించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చైనా ప్రభుత్వం విదేశీయులు పర్యటించడంపై కొన్ని నిబంధనలు పాటిస్తుందని వెల్లడించింది.