మ‌న దేశంలో క్రిస్మ‌స్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగే ప్రాంతాలు ఏవో తెలుసా..?

0

ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా క్రిస్మ‌స్ పండుగ రాబోతోంది. దీంతో చాలా మంది ఇప్ప‌టికే క్రిస్మ‌స్ వేడుక‌ల ఏర్పాట్ల‌లో మునిగిపోయారు. క్రిస్మ‌స్‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుపుకుంటున్నా, మ‌న దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ పండుగ వేడుక‌లు నిజంగా ప్ర‌పంచ స్థాయిలో జ‌రుగుతాయి. మ‌రి భార‌త్‌లో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రిగే ప్రాంతాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందామా..!

గోవా
మ‌న దేశంలోని ముఖ్య‌మైన ప‌ర్యాట‌క ప్రాంతాల్లో గోవా కూడా ఒక‌టి. ఇక్క‌డికి విదేశీ టూరిస్టులు ఎక్కువ‌గా వ‌స్తుంటారు. అలాగే చ‌ర్చిలు కూడా ఇక్క‌డ ఎక్కువ‌గానే ఉంటాయి. అందువ‌ల్ల ఈ రాష్ట్రంలో క్రిస్మ‌స్ సంబురాలు అంబ‌రాన్నంటుతాయి. చ‌ర్చిల‌న్నీ విదేశీ టూరిస్టుల‌తో నిండిపోతాయి. అక్క‌డ ఉన్న చ‌ర్చిల‌న్నింటినీ పోర్చుగీసు వారి పాల‌న‌లో నిర్మించినందున వాటి క‌ళా వైభ‌వం ఇప్ప‌టికీ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంటుంది.

కేర‌ళ‌
మ‌న దేశంలో అధికంగా చ‌ర్చిలు ఉన్న రాష్ట్రాల్లో కేర‌ళ మొద‌టి స్థానంలో ఉంది. అందుక‌ని అక్క‌డ కూడా క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. ముఖ్యంగా కేర‌ళ‌లోని బ్యాక్ వాట‌ర్‌, బీచ్ వంటి ప్ర‌దేశాల్లో క్రిస్మ‌స్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతాయి.

ముంబై
క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ముంబైలోనూ ఘ‌నంగానే నిర్వ‌హిస్తారు. ఇక్క‌డి బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది మౌంట్ చర్చిలో క్రిస్మ‌స్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతాయి. ఈ చ‌ర్చిలో క్రిస్మ‌స్ రోజున పెద్ద ఎత్తున ప్రార్థ‌న‌లు నిర్వ‌హిస్తారు.

డామన్, డయ్యు
డామన్, డయ్యుల‌లో ప్ర‌తి ఏటా క్రిస్మ‌స్ వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. డ‌య్యులోని సెయింట్ థామస్ చర్చి, సెయింట్ పాల్ చర్చి, డామన్ లోని రెమిడీస్ లేడీ ప్ర్రార్థనాలయం, రోసరీ లేడీ ప్రార్థనాలయం, బోమే జీసస్ చర్చి, అంగుస్థీఅస్ లేడీ ప్రార్థనాలయాల‌లో క్రిస్మస్ సందర్భంగా ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హిస్తారు.

దాద్రా నాగర్ హవేలీ
మ‌న దేశంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రా నాగర్ హవేలీ ఒక‌టి. ఇక్క‌డ కూడా ప్ర‌తి ఏటా క్రిస్మ‌స్‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఇక్క‌డి రోమన్ కాథలిక్ చర్చికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దీన్ని 1886 – 1889 మధ్యలో నిర్మించారు. ఈ చర్చి నిర్మాణం ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. క్రిస్మ‌స్ స‌మ‌యంలో పెద్ద ఎత్తున క్రైస్త‌వులు ఈ చ‌ర్చిలో ప్రార్థ‌న‌లు చేస్తారు.

షిల్లాంగ్
దీన్ని తూర్పు స్కాట్లాండ్ అని పిలుస్తారు. ఇక్క‌డ ఉన్న కేథడ్ర‌ల్ కాథలిక్ చర్చి ఎంతో మందిని ఆక‌ట్టుకుంటుంది. ఏటా క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ఇక్క‌డ ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. సుమారుగా 3 ల‌క్ష‌ల మందికి పైగా ఇక్క‌డ క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొంటారు.
Please Read Disclaimer